యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, తిరు వీధులు సందడిగా మారాయి.
యాదాద్రి, డిసెంబర్ 19 : ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో యాదాద్రి భక్తజనసంద్రంగా మారింది. దీంతో ఆలయ తిరువీధులు, మొక్కు పూజల మండపాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు ఉదయం స్వామికి తలనీలాలు సమర్పించి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిలుచున్నారు. రోడ్లు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలు అనుమతించలేదు. దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ప్రత్యేక పూజల కోలాహలం..
ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయమే ప్రత్యేక పూజలు చేశారు. నిజాభిషేకంతో ఆరాధనలు చేసి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదించారు. సుదర్శన నారసింహ హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. కల్యాణమూర్తులను ముస్తా బు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు జరిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. ధనుర్మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు కుటుంబసమేతంగా వత్రాలను ఆచరించడంతో పాటు, స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పర్వతవర్దిణి సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేక, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా
సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి వేదాశీర్వచనం, ప్రసాదం అందించారు. అనంతరం యాదాద్రి నూతన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని ఇంతపెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు ముక్కెర్ల సతీశ్‌యాదవ్, ఆకుల శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.