భద్రాచలం, పర్ణశాలల్లో వరాహావతారంలో రామయ్య దర్శనం
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 5: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. స్వామివారు బుధవారం వరాహావతారంలో దర్శనమిచ్చారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఉత్సవ పెరుమాళ్లను, ఆండాళ్ తల్లిని, శ్రీకృష్ణ పరమాత్మను, పన్నిద్ధాళ్వార్లను బేడా మండపంలో ఉంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావైలోని 30 పాశురాలను విన్నవించారు. అనంతరం నిత్యకల్యాణమూర్తులను వరాహావతారంలో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. రాజభోగం నివేదన చేశారు. సాయంత్రం దర్బారు సేవ, దివిటీ సలాం, నక్షత్ర హారతి, బంతులాట, వేదస్వస్తి జరిపారు. ఆస్థాన విద్వాంసులు తూము నర్సింహాదాసు, భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. దేవస్థానం ఈవో శివాజీ దంపతులు, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్ పాల్గొన్నారు. పర్ణశాల పుణ్యక్షేత్రంలోనూ స్వామివారు వరాహావతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు భార్గవాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, నర్సింహాచార్యులు, ఆలయ సూపరింటెండెంట్ కిశోర్, ఆలయ ఇన్చార్జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నారసింహావతారం..
భద్రాద్రి రామయ్య గురువారం నారసింహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడిని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి శ్రీమహా విష్ణువు నృసింహావతారమెత్తాడు. ఈ అవతారం నిడివి స్వల్పకాలమైనా.. భగవానుడి సర్వ వ్యాపకతను తెలుపుతుందన్నది పురాణ ప్రశస్తి.