మోర్తాడ్, డిసెంబర్22: బాల్కొండ నియోజకవర్గానికి తలాపునే గోదావరి ఉన్నా చుక్కనీరు లేని పరిస్థితులు ఒకప్పుడు ఉండేవని, కానీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన చర్యలతో నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. మోర్తాడ్‌లోని ఆర్ఎన్బీ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేయడంతో పాటు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కేక్ కట్‌చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలను బాల్కొండకు రప్పించిన ఘనత మంత్రి ప్రశాంత్‌రెడ్డిదే అన్నారు. భూగర్భ జలాలు పెరిగేలా పెద్దవాగులో చెక్‌డ్యాముల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడని, అలాంటి నాయకుడితోనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటున్నదని చెప్పారు. రైతుల కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారని, అందుకే క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, డీసీవో సింహాచలం, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు కల్లెడ ఏలియా, రాజపూర్ణానందం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సర్పంచ్ భోగ ధరణి, ఎంపీటీసీలు రాజ్‌పాల్, శాస్త్రి, ఇంతియాజ్, దడివె నవీన్, మురళీగౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందంగా జరుపుకోవాలి..
ఎడపల్లి (శక్కర్‌నగర్), డిసెంబర్ 22: క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో క్రైస్తవులకు పండుగ గిఫ్ట్‌లను ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఎంపీపీ కొండెంగెల శ్రీనివాస్, ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, చర్చి ఫాదర్ తిమోతి రాజుతో పాటు పి. నాగభూషణం తదితరు లు పాల్గొన్నారు.
నవీపేట చర్చిలో..
నవీపేట, డిసెంబర్ 22: నవీపేటలోని పెంతోకోస్తు చర్చి లో తహసీల్దార్ లత, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్, పాస్టర్ నేహా మ్యా, ఆనంద్, రమేశ్, సాయికుమార్ గౌడ్, అజ్జు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.