మాక్లూర్, డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ కళాశాలకు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు కొవిడ్-19, మనీ మేనేజ్మెంట్పై బుధవారం అవగాహన కల్పించారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేశ్ కుమారుడు అద్విత్ బిగాల, యోహాన్ టిబ్రెవాలా, యుక్త్ అగర్వాల్, ప్రకెట్ అగర్వాల్ 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులందరికీ తరగతుల వారీగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించారు. కొవిడ్ వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ ధరించడం, శానిటేషన్, పరిసరాల శుభ్రతపై అవగాహన, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే సేవింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల విద్య అనంతరం ఎంచుకునే అంశాలతోనే భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. తమ దగ్గర ఉన్న పాకెట్ మనీలో కనీసం 20 శాతం పొదుపు చేసుకునే విధానాన్ని అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మనీ మేనేజ్మెంట్ చేసిన దానితో ఏదైనా రంగంలో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉంటాయని వివరించారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. విద్యార్థులు సేవింగ్స్, మనీ మేనేజ్మెంట్ అంశాలతో పాటు కొవిడ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలనే ఆసక్తితో తమ స్వగ్రామమైన మాక్లూర్‌కు వచ్చారన్నారు. తన కుమారుడు అద్విత్తోపాటు మరో ముగ్గురు విద్యార్థులు వచ్చారని తెలిపారు. విద్యార్థులకు శానిటైజర్లతోపాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. హెచ్ఎం శ్రీహరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, ఎస్ఎంసీ చైర్మన్ మర్ల దత్తు, విఠల్,రాకేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.