ఆది నుంచీ అన్నదాతకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ సర్కారు నేడు మరోసారి రైతన్న కోసం కదం తొక్కేందుకు సిద్ధమైంది. వడ్ల కొనుగోళ్లలో కేంద్రం మొండి వైఖరిపై నిరసన జెండా ఎత్తుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం పల్లెపల్లెన నిరసన తెలిపేందుకు గులాబీ దండు సిద్ధమైంది. బీజేపీ సర్కారు చేస్తున్న అన్యాయంపై గళమెత్తేందుకు జిల్లా రైతాంగం సైతం టీఆర్ఎస్తో కలిసివచ్చేందుకు సై అంటున్నది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, చావుడప్పు వంటి కార్యక్రమాలను గ్రామగ్రామాన నిర్వహించనున్నారు. భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో జరిగే నిరసనలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఆలేరు నియోజకర్గ కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొననున్నారు.ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, మండల, గ్రామ కమిటీల సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు హాజరై రైతులకు బాసటగా నిలువనున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి వడ్లు కొనలేమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ మరోసారి కొట్లాటకు దిగుతున్నది. ఇదే విషయంపై నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆ తర్వాత 18న ఇందిరాపార్క్ వద్ద సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ధర్నా నిర్వహించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తినా కేంద్రం మొండివైఖరి అవలంబించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంతవరకు నిరంతర పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కేంద్ర వైఖరికి నిరసనగా రైతులతో కలిసి నిరసన తెలపాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దాంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధ్దమయ్యాయి.
ఎక్కడి నాయకులు అక్కడే..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతోపాటు చౌటుప్పల్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టనున్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే నిరసన కార్యక్రమం బాధ్యతలను మండలస్థాయి నాయకులకు అప్పగించారు. కొన్నిచోట్ల రాష్ట్రస్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలు బాధ్యులుగా వ్యవహరించనున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల, గ్రామ, మున్సిపల్ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ, గ్రామ, వార్డు కమిటీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చౌటుప్పల్‌లో నిర్వహించే నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. నిరసన కార్యక్రమాల విజయవంతంపై టీఆర్ఎస్ నాయకులు మండల, గ్రామస్థాయిల్లో ఆదివారం సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రైతుల మనోభావాలు కేంద్రానికి తెలిసేలా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా పార్టీశ్రేణులను సంసిద్ధ్దం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు చేస్తున్న అన్యాయాన్ని రైతులకు పార్టీ శ్రేణులు స్పష్టంగా వివరించాయి.
ఊరూరా చావు డప్పు..
స్వరాష్ట్రంలో ప్రశాంతంగా జీవిస్తున్న రైతాంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడిన రాష్ట్ర రైతాంగానికి స్వరాష్ట్రంలో 24 గంటల విద్యుత్, సాగు నీరు, పెట్టుబడి కోసం రైతుబంధు కింద సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొండంత అండగా ఉంటూ వస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారు. రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వారి బతుకులను ఆగం చేసేలా వ్యవహరిస్తున్నది. యాసంగి ధాన్యం తరలింపులో ఎఫ్‌సీఐ కొర్రీలు పెట్టినా..రైతు ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటున్నది. యాసంగిలో వరిని పండించవద్దని.. పండించినా తాము కొనేదిలేదని కేంద్రం విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో..యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పల్లెపల్లెనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన తరహాలోనే రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ర్యాలీలు, చావుడప్పు మోగింపు, శవయాత్రలు నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి.