
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్‌కు అభిమానులు, ప్రజలు, సన్నిహితులు, వివిధ పార్టీల నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచగా, వేలాదిమంది కడసారి చూసేందుకు తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. అనంతరం స్టేడియం నుంచి ఈద్గా వరకు అంతిమయాత్ర నిర్వహించి, అక్కడ మసీదులో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పార్థివదేహానికి అంతిమయాత్రతో ఆయన స్వగ్రామమైన హోతి(బీ)కు తీసుకెళ్లి, ముస్లిం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు.
జహీరాబాద్, డిసెంబర్ 30 : హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ గుండెపోటుతో మృతిచెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియలు గురువా రం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేశారు. జహీరాబాద్ మండలం హోతి(బి)గ్రామంలోని శ్మశానవాటిలో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించగా, పోలీసులు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అభిమానులు, ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉదయం నుంచి సాయంత్రం వరకు జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో పార్థివదేహాన్ని ఉంచారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చివరి చూపు చూసేందుకు వేలమంది తరలివచ్చారు. మధ్యాహ్నం తర్వాత స్టేడియం నుంచి ఈద్గా మైదానం వరకు అంతిమయాత్ర నిర్వహించి, మసీదులో ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి పార్థివదేహాన్ని ఊరేగింపుగా హోతి (బి) గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
పోలీసు గౌరవ వందనం..
సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రమణకుమార్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి అంత్యక్రియలకు హాజరవుతారని రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో హెలికాప్టర్ దిగేందుకు హెలీప్యాడ్‌ను నిర్మించారు. అయితే, సీఎం కేసీఆర్ అంత్యక్రియలకు రావడం లేదని, రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ హాజరవుతారని చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ రోడ్డు మార్గంలో జహీరాబాద్‌కు చేరుకుని బాగారెడ్డి స్టేడియంలో ఫరీదుద్దీన్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. హైదరాబాద్ డీఐజీ కమలాసన్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసులు గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. కాగా, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివదేహం వద్ద ముస్లిం, హిందు, క్రైస్తవ మతాలకు చెందిన మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హాజరైన ప్రముఖులు
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అంత్యక్రియలకు రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. అలాగే, శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, జహీరాబాద్, మెదక్ ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్, అందోల్, మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సే న్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల రాష్ట్ర చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు నరోత్తం, ఢిల్లీ వసంత్, ఎంజీ. రాములు తదితరులు హాజరై నివాళులర్పించారు.
అజాత శత్రువు ఫరీదుద్దీన్..
జహీరాబాద్/కోహీర్/ఝరాసంగం/న్యాల్కల్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ పాల్గొని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫరీదుద్దీన్ ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారన్నారు. తమ వద్దకు వచ్చిన ప్రతీసారి ప్రజల సమస్యలు చెప్పేవారని, కులమతాలకతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో అం త్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఫరీదుద్దీన్ ఎంతో సేవ చేశారని, అజాత శత్రువు అని అన్నారు. ఆయన అకాల మరణం టీఆర్ఎస్ పార్టీ, వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. సీఎం కేసీఆర్ అనారోగ్య కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేదని, ఫరీదుద్దీన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతిచెందడం చాలా బాధగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. జహీరాబాద్, మెదక్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఫరీదుద్దీన్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.