బన్సీలాల్‌పేట్ : మురికివాడలలో ఇరుకైన ఇండ్లలో నివసించిన పేదలకు ఆత్మగౌరవంతో జీవించేలా రెండు పడక గదుల ఇండ్లు కట్టించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సోమవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని బండమైసమ్మ నగర్, చాచానెహ్రూనగర్ బస్తీలలో కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డిఓ వసంత్ కుమారి, తాసిల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ శ్రీనివాస్ రెడ్డి, బేగంపేట్ సర్కిల్ డిప్యూటి కమీషనర్ ముకుందరెడ్డి, హౌజింగ్ ఎస్ఈ కిషన్, ఈఈ ఎం.వెంకట్‌దాస్ రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డిలతో కలసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులతో మాట్లాడారు. బండమైసమ్మనగర్ బస్తీలో 310 ఇండ్లను నిర్మిస్తున్నామని, చాచానెహ్రూనగర్‌లో 240 ఇండ్లను నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని, ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు పనులను జరుగుతున్నాయని తెలిపారు.
కరోనా కారణంగా కార్మికులు దొరక్కపోవడంతో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, కొంత సంయమనం పాటిస్తే డిసెంబర్ తొలివారంలో లబ్ధిదారులు ఆనందంగా తమ తమ ఇండ్లలో చేరాలని అన్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో సకల సదుపాయాలతో కూడిన ఇండ్లు సిద్దం చేసి, బస్తీ వాసుల సమక్షంలోనే అర్హులైన వారిని గుర్తించి, ఇండ్లను కేటాయిస్తామని మంత్రి అన్నారు.
అనంతరం పొట్టి శ్రీరాములు నగర్ డబుల్ ఇండ్ల కాలనీ సముదాయంలో నిర్మిస్తున్న అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను కూడా మంత్రి సందర్శించారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హౌజింగ్ డిఈఈ గంగాధర్, ఏఈలు మహేశ్, జంగయ్య, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు కే.లక్ష్మీపతి, పవన్‌కుమార్ గౌడ్, ప్రేమ్‌కుమార్, కమల్‌కుమార్, దేశపాక శ్రీను, జ్ఞాని, ఫహీమ్, అబ్బాస్, విజయ్‌శంకర్, బండమైసమ్మ నగర్ బస్తీ అధ్యక్షుడు జగదీశ్, చాచానెహ్రూనగర్ బస్తీ అధ్యక్షుడు అచ్చా నర్సింగ్‌రావు, ఎస్సీఆర్పీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌బాబు, మహేందర్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.