ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తి
పారదర్శకంగాఉద్యోగుల కేటాయింపు
సీనియారిటీకి ప్రాధాన్యతనిచ్చిన కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ
సీనియారిటీతోపాటు మెడికల్, ఇతర రిజర్వేషన్లనూ పరిగణనలోకి తీసుకున్న కమిటీ
ఈనెల 22న ఉద్యోగులకు కేటాయింపు ఆర్డర్స్
అత్యధికంగా విద్యాశాఖలో 10,621 మంది,పోలీస్ శాఖలో 2052 మంది ఉద్యోగులు
ఇప్పటికే ముగిసిన జోనల్ క్యాడర్ఉద్యోగుల ఆప్షన్ల అవకాశం
రంగారెడ్డి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో జిల్లా క్యాడర్ ఉద్యోగులు 15,732 మంది పని చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యంత్రాంగం లెక్కతేల్చింది. రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ పూర్తి పారదర్శకంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. సీనియారిటీ, మెడికల్, ఇతర రిజర్వేషన్లు, స్థానికత ఆప్షన్లనూ పరిగణనలోకి తీసుకొని పోస్టులను కేటాయించారు. మూడు జిల్లాల ఉద్యోగులకు ఈనెల 22న ఒకేసారి ఆర్డర్స్ ఇచ్చేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. అత్యధికంగా విద్యాశాఖలో 10,621 మంది ఉపాధ్యాయులు, పోలీస్ శాఖలో 2052 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జోనల్ ఉద్యోగులైన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఎస్ఐ, తదితర ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యింది.
నూతన జోనల్ విధానం ప్రకారం చేపట్టిన జిల్లా క్యాడర్ ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో జిల్లా క్యాడర్ ఉద్యోగులు 15,732 మంది పనిచేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం లెక్కతేల్చింది. దాదాపు వారం రోజులపాటు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో సీనియారిటీకి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. సీనియారిటీతోపాటు మెడికల్, ఇతర రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ మూడు జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లా క్యాడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతోపాటు ఆన్లైన్లో కూడా పొందుపర్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న ఉమ్మడి జిల్లాల్లో రెండు రోజుల నుంచి ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో అన్ని జిల్లాలకు ఒకేసారి ఆర్డర్స్ ఇచ్చే విధంగా ఈనెల 22న జిల్లా క్యాడర్ ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాలకు ఉద్యోగులను కేటాయించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టూ సర్వ్ కింద ఉద్యోగులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగులకు రంగారెడ్డితోపాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కేటాయించారు, ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపు సీనియారిటీ, ఇతర రిజర్వేషన్లు, స్థానికత ఆప్షన్లను కూడా పరిగణనలోకి తీసుకొని ఆయా జిల్లాలకు ఉద్యోగులను కేటాయించారు.
జిల్లా క్యాడర్ ఉద్యోగులు 15,732
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 15,732 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులున్నట్లు తేల్చారు. 56 శాఖలకు సంబంధించిన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను గురువారం రాత్రి వరకు పూర్తి చేశారు. అత్యధికంగా విద్యాశాఖలో 10,621 మంది ఉపాధ్యాయులు, పోలీస్ శాఖలో 2052 మంది ఉద్యోగులు, జిల్లా పరిషత్‌లో 501 మంది ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో 311 మంది ఉద్యోగులు, ఎక్సైజ్ శాఖలో 252 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జిల్లా క్యాడర్ ఉద్యోగులైన టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జమేదార్, చైన్‌మెన్, ధపేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి తదితర ఉద్యోగులను ఆయా జిల్లాలకు కేటాయించారు. అదేవిధంగా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో పూర్తి చేయనున్నారు. జోనల్ ఉద్యోగులైన డిప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఎస్ఐలు, తదితర ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యింది. గురువారం సాయంత్రం వరకు ఆప్షన్ల ఎంపికకు గడువుండగా, సీనియారిటీ, మెడికల్, ఇతర రిజర్వేషన్ల కింద జోనల్ క్యాడర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెలాఖరులోగా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులను ఆయా జిల్లాలకు కేటాయించనున్నారు. నూతన జోనల్ విధానం ప్రకారం జోనల్ క్యాడర్ ఉద్యోగులను చార్మినార్ జోన్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు కేటాయించనున్నారు.