
ఖమ్మం, డిసెంబర్ 24: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలకు పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవులకు శుక్రవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ అత్యంత పవిత్రమైన రోజని అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాల్లో పయనిస్తూ అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మైనార్టీ క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.
ప్రముఖుల శుభాకాంక్షలు..
క్రీస్తు జన్మదినం సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు సైతం జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా క్రీస్తు శాంతి మార్గంలోనే పయనించారని, ఆయన మార్గం అనుసరణీయమని అన్నారు. క్రిస్మస్ విషెస్ తెలిపిన వారిలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ తదితరులున్నారు.