ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నేడు (సోమవారం) నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. యాసంగిలో వడ్లను కొనుగోలు చేయబోమని చెప్పడంతోపాటు పూటకోమాట మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతోపాటు వివిధ కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. యాసంగిలో సాగు చేసిన వడ్లను ఒక్క కిలో కూడా కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా చెప్పడంతో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. నల్లషర్టులు, బాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహిస్తామని, నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలుపడంతోపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో యాసంగిలో సాగు చేసిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అన్ని పంటలకు ఎంఎస్పీ చట్టం అమలు చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా రిజిస్టర్లలో రైతుల సంతకాలను తీసుకోవాలని సూచించారు.
నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి
నిజాంసాగర్, డిసెంబర్ 19: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నదని, ఇందుకు నిరసనగా నేడు (సోమవారం) చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని టీఆర్ఎస్ నాయకులు కోరారు. మండలకేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు విలేకరులతో ఆదివారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి గ్రామంలో దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ యువ నాయకుడు హరీశ్ షిండే, సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, నిజాంసాగర్ వైస్ ఎంపీపీ మనోహర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, నాయకులు రాజు, సాయిరాం, మద్నూర్ మండల నాయకులు సంగమేశ్వర్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.