
ఓటేసిన ప్రముఖులు
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ ఓటేశారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తూప్రాన్‌లో జడ్పీ చైర్పర్సన్ హేమలత, సంగారెడ్డిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, జీవన్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎంపీ బీబీ పాటిల్, అందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటువేశారు. పోలింగ్ సరళిని అభ్యర్థులు పరిశీలించారు. కాగా, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే హుస్నాబాద్ కేంద్రంలో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఓటు వేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యం వెల్లివిరిసింది. ఓటేసేందుకు ‘స్థానిక’ ఓటర్లు ఎంతో ఉత్సాహం చూపారు. శుక్రవారం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 99.22 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 1026 మంది, 13 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, 1018 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 448(98.66), మహిళలు 570(99.65) మంది ఉన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈనెల 14న ఓట్ల లెక్కంపు జరుగనున్నది. ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతం
సిద్దిపేట, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్‌జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 99.22 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1026 మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు 13మంది ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుండగా, 1018 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 448 (98.66) కాగా, మహిళలు 570 (99.65) మంది ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తూప్రాన్‌లో జడ్పీ చైర్పర్సన్ హేమలత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సంగారెడ్డిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్, జీవన్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎంపీ బీబీ పాటిల్, అందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటువేశారు. పోలింగ్ సరళిని టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈనెల 14న ఓట్ల లెక్కంపు జరుగనున్నది. కాగా, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఓటు వేశారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన వీరబ్రహ్మయ్య..
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పోలింగ్‌కు ముందు ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య సందర్శించాడు. పోలింగ్ అధికారులతో కంపార్ట్మెంట్ ఏర్పాటు, వెబ్‌కాస్టింగ్, ఓటరు లిస్ట్, బ్యాలెట్ బాక్సు సీలింగ్‌ను పరిశీలించారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ ఉదయమే పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ప్రశాంత వాతవారణంలో జరిగేలా చూశారు. కాగా, పోలింగ్ సరళిని పరిశీలించగా, మొదటగా 10 గంటలకు వెలువడిన ఓటింగ్ వివరాల్లో 3.8 శాతం కాగా, మధ్యాహ్నం 12 గంటల వచ్చిన బులెటిన్‌లో 42.01 శాతం, 2 గంటలకు 96.69 శాతం, సాయంత్రం 4 గంటలకు 99.22 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రధానంగా 12 గంటల నుంచి 2 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 54.68 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 9 పోలింగ్ కేంద్రాలకు గానూ ఒక్కో కేంద్రంలో పోలైన వివరాలు పరిశీలించగా, తూప్రాన్, నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం ఓట్లు పోలు కాగా, మెదక్‌లో 99.33శాతం, నర్సాపూర్‌లో 98.53 శాతం, సంగారెడ్డిలో 98.74, అందోల్‌లో 97.18 శాతం, గజ్వేల్‌లో 98.99 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని కేంద్రాల్లో పూర్తిగా కరోనా నిబంధనలు పాటిస్తూ, వచ్చిన ప్రతీ ఓటరును థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజ్ చేస్తూ భౌతిక దూరం పాటించేలా వైద్యారోగ్య సిబ్బంది, పోలింగ్ సిబ్బంది కృషి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు కేంద్రాల్లో వంద శాతం…
మెదక్ శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో 99.22 శాతం పోలింగ్ నమోదైంది. 1026 ఓట్లకు గానూ 1018 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 454 ఓట్లకు గానూ 448 మంది ఓట్లు వేయగా, 98.68 శాతం, మహిళలు 572కు గానూ 570 మంది ఓటు వేయగా, 99.65 శాతం నమోదైంది. తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో మొత్తం 63 ఓట్లకు గానూ 63 ఓట్లు పడ్డాయి. ఇందులో 27 మంది పురుషులు, 36 మంది మహిళలు ఉన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 162 మంది ఓటర్లకు గానూ 162 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 72 మంది పురుషులు, 90 మంది మహిళలు ఓట్లు వేశారు. జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన పోలింగ్‌లో 85మంది ఓటర్లు కాగా, 85 మంది ఓట్లు వేశారు. ఇందులో 36 మంది పురుషులు, 49 మంది మహిళలున్నారు. నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయంలో 89 మంది ఓటర్లుండగా, 89 మంది ఓట్లు పోలయ్యాయి. ఇందులో 37 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థికి ముందస్తు శుభాకాంక్షలు..
ఓటు హక్కు వేసిన ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తుండడంతో ఆ ప్రాంతంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు నామమాత్రమేనని, టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని పలువురు సంతోషంగా చర్చించుకోవడం కనిపించింది. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి ఓటు వేసిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసినా మాదే విజయం
అందోల్, డిసెంబర్ 10: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసినా, ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థిని స్పష్టమైన మెజార్టీతో గెలిపించనున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీలో కయ్యం.. గల్లీలో వియ్యం.. అనే విధంగా ప్రవర్తిస్తూ ప్రజలు, రైతులను మోసం చేస్తున్నారన్నారు. మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అలాగే పని చేశాయని, ఇప్పుడూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మరోసాని అనైతిక పొత్తుకు పూనుకున్నాయన్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ టీఆర్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అందోల్ ప్రజలు ఆయన్ని ఎన్నిసార్లు గెలిపించినా ఇక్కడి ప్రజలను ఆయన కనీసం మనుషులుగా కూడా చూడలేదని విమర్శించారు. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం, కేసీఆర్‌పై చవకబారు విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి విమర్శలను పార్టీ నాయకులు తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ బాలయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
దుఃఖాన్ని దిగమింగి..
నర్సాపూర్, డిసెంబర్ 10 : తన సోదరుడి మృతదేహం ఇంట్లో ఉన్నా, దుఃఖాన్ని దిగమించి ఓ జడ్పీటీసీ తన బాధ్యతను నెరవేర్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసింది. కొల్చారం మండలానికి చెందిన జడ్పీటీసీ మేఘమాల అన్న కొన్యాల మధుసూదన్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండడంతో తన సోదరుడు చనిపోయాడనే బాధను దిగమింగుకొని, నర్సాపూర్ పోలింగ్ కేంద్రానికి వచ్చింది. అక్కడ కుర్చీలో కూర్చొని బోరుమని విలపించడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు, ఓటర్లు ఆమె బాధను చూసి చలించిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి జడ్పీటీసీ మేఘమాలను ఓదార్చారు. ఓటు వేసిన అనంతరం ఆమెను భర్త తీసుకెళ్లారు.
భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మెదక్, డిసెంబర్ 10 : మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. బ్యాలెట్ బ్యాక్సులు కట్టుదిట్టమైన మూడంచెల భద్రత మధ్య మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూం వద్ద మొత్తం 15 మంది పోలీసు సిబ్బంది ఉంటారని, అందులో ఒక ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఏఎస్ఐలు, మిగతా వారు కానిస్టేబుళ్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. స్ట్రాంగ్ రూం భవనం చుట్టూ పహారాకు ఐదుగురు కానిస్టేబుళ్లతో పాటు మరో ఐదు మంది పెట్రోల్ వెహికిల్ కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. అంతకుముందు జిల్లా ఎన్నికల సహాయ అధికారి రమేశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఏజెంట్లు గంగాధర్, ఆంజనేయులు సమక్షంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులు, మూడంచెల పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బ్యాక్సులను భద్రపరిచి గదికి సీలు వేశారు.
ఏకపక్ష మెజార్టీతో విజయం
నారాయణఖేడ్, డిసెంబర్ 10 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి ఏకపక్ష మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌లో ఓటు వేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. స్వరాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయనడానికి నారాయణఖేడ్ నియోజకవర్గం నిదర్శనమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు పలికి, యాదవరెడ్డిని ప్రజాప్రతినిధులు గెలిపిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.
యాదవరెడ్డి విజయం ఖాయం
నర్సాపూర్, డిసెంబర్ 10 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ఓటు హక్కును వినియోగించుకొని గెలుపు చిహ్నాన్ని సూచించారు. నర్సాపూర్‌లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది కేవలం నామమాత్రపు పోటీయేనని, టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లందరూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీటీసీ బాబ్యా నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే..
మెదక్, డిసెంబర్ 10 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ తరఫున యాదవరెడ్డిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారన్నారు. ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 1026మంది ఓటర్లు ఉండగా, అందులో 777 ఓట్లు టీఆర్ఎస్వే ఉన్నాయన్నారు. ఎవరెన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.