ఏప్రిల్‌లో ఆగమనం
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులు
కాళేశ్వరం వద్ద ఏర్పాట్లపై జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా సమీక్ష
ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
త్రివేణి సంగమం పుష్కర ఘాట్ సందర్శన
ప్రాణహిత నది ప్రవాహం పరిశీలన
కాళేశ్వరం, అక్టోబర్ 29 : ‘ప్రతి పన్నెండు ఏండ్లకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వస్తున్నాయి. కాళేశ్వరానికి రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ 3 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్టు పనులన్నీ పూర్తి చేయండి. కాళేశ్వరం అభివృద్ధికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో ఇప్పటివరకు ఏ పనులు చేశారు? ఇంకా మిగిలిన పనుల ఆలస్యానికి కారణం ఏమిటి? వాటిని కూడా ఈ ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయండి..’ అంటూ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వర అతిథి గృహంలో అర్చకులు, అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రాణహిత పుష్కరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ మొదటిసారి కాళేశ్వరంకు రాగా ఆలయ ఈవో మారుతి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నాక అమ్మవారి కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ త్రివేణి సంగమం పుష్కర ఘాట్‌ను సందర్శించారు. ప్రాణహిత నది ప్రవహిస్తున్న తీరును పరిశీలించారు. గోదావరిలో ప్రాణహిత నది కలిసే చోటును గుర్తించి పుష్కర స్నానాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రాణహిత పుష్కరాల ఆవశ్యకతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ పుష్కరాల విశిష్టత గురించి చెబుతూ సుమారు రోజుకు 3 లక్షల వరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఆలయ ఈవో మారుతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం అభివృద్ధికి కేటాయించిన రూ.25 కోట్ల నిధులతో ఇప్పటివరకు 11 పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పూర్తి కావల్సి ఉందని, ఆలస్యానికి గల కారణాలను కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు.
పంచాయతీరాజ్ ఈఈ మల్లికార్జున్‌ను, తహసీల్దార్ శ్రీనివాస్‌ను ప్రశ్నించగా పనుల ఆలస్యానికి భూ సమస్యలు అడ్డంకిగా ఉన్నాయని చెప్పడంతో పుష్కరాల సమయానికి ఆ సమస్యలన్నీ పరిష్కరించి త్వరగా పూర్తి చేసి కాళేశ్వరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలంటూ ఆదేశించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరానికి అదనంగా బస్సులు పెంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎన్హెచ్ఏ అధికారులు జాతీయ రహదారి పనుల గుంతలు పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. డీపీవో ఆశాలత మాట్లాడుతూ అదనంగా పారిశుధ్య కార్మికులను నియమించుకుని శానిటేషన్ పనులను పటిష్టం చేస్తామని తెలిపారు. మరో పక్షం రోజుల్లో మళ్లీ వస్తాననీ, అప్పటికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాల నిర్వహణ సమయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఒక నిర్ణయంకు రావాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, అడిషనల్ కలెక్టర్ దివాకర, జడ్పీ సీఈవో శోభరాణి, డీఎంహెవో శ్రీరామ్, డీపీవో ఆశాలత, కాటారం డీఎస్పీ కిషన్, సీఐ కీరణ్, ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణ, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.