మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వారంలో ఇబ్రహీంపట్నంలో రూ.280 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
మంత్రి సబితారెడ్డి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధి
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 1200 కోట్లు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డిజిల్లా మహేశ్వరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు
షాబాద్, జనవరి 29 : రంగారెడ్డి జిల్లా కొత్తరూపును సంతరించుకోనున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి పి. సబితాఇంద్రారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఒకే రోజు మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 371 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. అతిత్వరలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ. 280కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. మంత్రి సబితారెడ్డి నాయకత్వంలో జిల్లా రూపురేఖలు మారనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయన్నారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. భారీ వర్షాలు వస్తే కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, చెరువులకు నీళ్లు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా రూ. 100 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న కేటీఆర్‌కు మంత్రి సబితారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రంగారెడ్డిజిల్లా రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి పర్యటించి రూ.371కోట్ల9లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కోటి రూపాయలు నిధులు వస్తే.. అదే ఒక పండుగ మాదిరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఈ రోజు ఒక్కరోజే మహేశ్వరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.207 కోట్లు, గతేడాది అకాల వర్షాలు, వరదలతో కాలనీలన్నీ నీటమునిగిన పరిస్థితి మళ్లీ రావద్దని, వరదనీటి కాల్వలను బాగు చేసేందుకు రూ.92.89 కోట్ల పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. రోడ్లు బాగుంటేనే ప్రజలకు సౌకర్యం బాగుంటుందని, రూ.58.20 కోట్ల రోడ్డు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాల నిర్మాణం కోసం రూ.13కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఒకే రోజు 371 కోట్లతో మహేశ్వరంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అభివృద్ధే ధ్యేయంగా..
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, జలమండలి ఎండీ దానకిశోర్, మున్సిపల్ సీడీఎంఏ సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పార్టీ యువనేతలు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, గాయకుడు సాయిచంద్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు పారిజాత నర్సింహారెడ్డి, దుర్గా దీప్లాల్చౌహన్, డిప్యూటీ మేయర్లు తీగల విక్రమ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు అబ్దుల్లాసాధి, మధుమోహన్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కామేశ్‌రెడ్డి, ఖలీఫా, లక్ష్మయ్య ఉన్నారు.
వివక్షత లేకుండా అభివృద్ధి పనులు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ అవసరముంటే అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని.. రాబోవు వారం రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా రూ.280కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా అక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నవారు ఎమ్మెల్యేనా, మంత్రి అని కాకుండా.. ప్రజాప్రతినిధులుగా ఎక్కడ ఎవరు ఉన్నా ప్రజలకు సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అది ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి కాబట్టి సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ప్రజలకు మెరుగైన ఫలాలు సులువుగా అందించాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మంత్రి సబితారెడ్డి నాయకత్వంలో తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు
మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం రూ.371కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ తాగునీరందిస్తున్నామని, గతంలో ఏ కార్యక్రమానికైనా వెళ్లాలంటే తాగునీటి ఇబ్బందులతో మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం చెప్పేవారని, అలాంటిది సీఎం కేసీఆర్ ఒక మంచి విజన్‌తో మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అకాల వర్షాలతో కాలనీల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించేవారని. చెరువులకు నీళ్లు వచ్చినప్పుడు కాలనీలు మునిగిపోకుండా, భవిష్యత్తులో ఇబ్బందులు రావద్దని, రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాతోపాటు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.