క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం
పార్టీ అనుబంధ కమిటీలను
కలుపుకొని ముందుకు సాగుతాం
పెండింగ్లోని కమిటీల ఏర్పాటుకు చర్యలు
క్యాడర్ బలోపేతానికి త్వరలోనే శిక్షణా కార్యక్రమాలు
మంత్రి, ఎమ్మెల్యేల సమన్వయంతో ముందుకెళ్తాం
జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా
టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి
రంగారెడ్డి, జనవరి 29, (నమస్తే తెలంగాణ) ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్కు ఎదురులేదు, టీఆర్ఎస్కు తిరుగులేదు.. ఎన్నికలేవైనా.. గెలుపు మాత్రం గులాబీ పార్టీదే.. ఇప్పటికే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీని అందరి సహకారంతో మరింత బలోపేతం చేస్తాం..’ అని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నూతన అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని, అందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలకు త్వరలో శిక్షణా తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఇంకా ఆయన ముందున్న సవాళ్లు.. అభివృద్ధి పనులు, సాగు జలాలు తదితర అంశాలపై పలు విషయాలను వివరించారు.
రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్కు తిరుగులేదు. ఏ ఎన్నికలు జరిగినా గెలుపు మాత్రం టీఆర్ఎస్దే అనే స్థాయిలో పార్టీ బలోపేతం అయ్యింది. కంచుకోటగా మారిన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్తానని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. క్యాడర్ బలోపేతంలో భాగంగా త్వరలోనే పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. టీఆర్ఎస్ హయాంలో జిల్లాలో ఏడేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రణాళికను రూపొందించనున్నారు, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలుచేయనున్నారు, జిల్లా అభివృద్ధిలో ఎలాం టి పాత్ర పోషించనున్నారనే తదితర విషయాలపై నూతన అధ్యక్షుడిగా నియామకమైన సందర్భం గా శనివారం ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించగా పలు విషయాలను వెల్లడించారు.
జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టనున్నారు ?
క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా. జిల్లాలో ఏ పార్టీకి లేనంతగా క్యాడర్ టీఆర్ఎస్కు ఉంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు త్వరలోనే ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తాం. అంతేకాకుండా గ్రామ స్థాయిలో, వార్డుల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారున్నారు, వారిని సరైన రీతిలో తీసుకొనిపోయే బాధ్యత నాపై ఉంది .
ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏ విధంగా సమన్వయం చేయనున్నారు ?
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూనే పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించి న జిల్లా అధ్యక్ష పదవిని కూడా అందర్ని కలుపుకెళ్లి సమర్థవంతంగా నిర్వహిస్తా. నెలలో రెండుసార్లు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశమై పార్టీ పరమైన అంశాలతో జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు చర్యలు తీసుకుంటా. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సమష్టిగా ముందుకెళ్తా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పని చేసిన అనుభవం ఉంది కాబట్టి కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉం టా. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.
పార్టీ అనుబంధ కమిటీల ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ?
జిల్లా కమిటీతోపాటు ఎస్సీ, బీసీ తదితర అనుబంధ కమిటీలను త్వరలోనే ఎన్నుకుంటాం. అదేవిధంగా ఇప్పటికే గ్రామ, వార్డు, మండల, మున్సిపల్ కమిటీల ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది, అయితే పెండింగ్లో ఉన్న కమిటీల ఎన్నిక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం.
సాగునీటి కల ఎప్పటికీ నెరవేరనుంది..?
సీఎం కేసీఆర్ జిల్లాకు సాగు నీరు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగు నీరందనుంది, అతి త్వరలో సాగునీటితోపాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో జిల్లాలో
టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది, ఇతర పార్టీల నుంచి పోటీ ఉంటుందా ?
రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఆ దిశగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ బలోపేతానికి.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేలా కృషి చేస్తా. జిల్లాలో ఇతర పార్టీలది దిక్కుతోచని పరిస్థితిలా తయారైంది. ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోం.