ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు
సకల సౌకర్యాలు, ఇంగ్లిష్ మీడియంలో బోధన
మరమ్మతులు అవసరమున్న పాఠశాలలను గుర్తించిన అధికారులు
రంగారెడ్డిజిల్లాలో రూ.200కోట్లతో వసతుల కల్పన
వికారాబాద్ జిల్లాలో 830 పాఠశాలల్లో మరమ్మతులు అవసరం
9,677 డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు
విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించింది. అందుకోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో రూ.200 కోట్లతో వసతుల కల్పనకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో రూ. 34.67కోట్లను ఫర్నిచర్ కోసం ఖర్చు చేయనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 830 పాఠశాలల్లో మరమ్మతుల అవసరాన్ని అధికారులు గుర్తించారు. తరగతి గదుల్లో విద్యార్థులు కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. జిల్లాకు మొత్తం 9,677 డ్యూయల్ డెస్క్‌లు అవసరమని తేల్చారు. రంగారెడ్డి జిల్లాలో 1300 ప్రభుత్వ పాఠశాలల్లో 1,57,876 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వికారాబాద్ జిల్లాలో మొత్తం 1107 ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 10వేల మంది విద్యార్థులు ఉన్నారు.
పరిగి, జనవరి 29 : పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది. ఇందులో ప్రధానంగా ప్రతి పాఠశాలలోనూ 12 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనున్న ది. ఈసారి జిల్లాలో ముందుగా అధిక విద్యార్థులు ఉన్న 35శాతం పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లో భాగంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, అన్ని పాఠశాలలకు తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, పాఠశాల భవనాలకు మరమ్మతులు, చాక్‌బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలావస్థకు చేరిన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. అవసరమైన సౌకర్యాల కల్పనకోసం సుమారు రూ.250 కోట్లు అవసరం అవుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మరమ్మతులు అవసరమైన పాఠశాలలను గుర్తించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలలు-764, ప్రాథమికోన్నత పాఠశాలలు-116, ఉన్నత పాఠశాలలు- 174, టీఎస్ఎంఎస్లు-9, కేజీబీవీలు-18, టీఎస్ గురుకులాలు 26 ఉన్నాయి. వాటిలో సుమా రు లక్షా10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి పదోతరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయి ంచింది. దీంతో నిరుపేదలకు ఆంగ్లం అందనున్నది.
జిల్లాలోని పాఠశాలల్లో 9,677 డ్యూయల్ డెస్క్‌బెంచీలు
వికారాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా మొత్తం 9,677 డ్యూయల్ డెస్క్ బెంచీలు అవసరమని విద్యాశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే డ్యూయల్ డెస్క్ బెంచీలు ఉన్నచోట కాకుండా అవసరమైన చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నారు. తాం డూరు నియోజకవర్గంలో 7,794 మంది విద్యార్థులకు 2,598 డ్యూయల్ డెస్క్‌లు, పరిగి నియోజకవర్గంలో 7,584 మందికి 2,528 డ్యూయల్ డెస్క్‌లు, వికారాబాద్ నియోజకవర్గంలో 6,489 మందికి 2,163, కొడంగల్‌లో 6174 మందికి 2,058, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట్ మండలంలో 992 మంది విద్యార్థులకు 330 డ్యూయల్ డెస్క్ బెంచీలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్ఐఎస్ యాప్‌లో ఆయా పాఠశాలల వారీగా అవసరమైన డ్యూయల్ డెస్క్‌లు ఎన్ని అవసరమనేది స్పష్టంగా అప్లోడ్ చేశా రు. ఈ ప్రతిపాదనల ఆధారంగానే పాఠశాల ల వారీగా డ్యూయల్ డెస్క్ బెంచీలను ప్రభు త్వం అందజేయనున్నది. ఇవేకాకుండా స్టాఫ్‌రూమ్, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయాల్లోనూ అవసరాల మేరకు సరిపడా ఫర్నిచర్‌ను కూడా పాఠశాలలకు పంపిణీ చేస్తారు.
830 పాఠశాలల్లో .. మరమ్మతులు అవసరం
పాఠశాలల్లోని తరగతి గదుల పెచ్చులూడటం, కిటికీలు, డోర్లు, ఫ్లోరింగ్ తదితర మరమ్మతు పనులకు ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వం నిధులను కేటాయించనున్న ది. ఇందులో భాగంగా ప్రతి తరగతీ గది, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం, తదితర గదుల పరిస్థితి పూర్తిగా తెలిసేలా ఒక్కో గదికి సంబంధించిన 8 ఫొటోలను ఎస్ఐఎస్ యాప్‌లో అధికారులు అప్లోడ్ చేశారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న పా ఠశాలల్లో 326 పాఠశాలల్లో మైనర్, 504 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసిన పాఠశాలల వారీగా గదుల్లో ఏఏ మరమ్మతులు చేపట్టాలన్నది నిర్ణయించి, వాటికి ఎంత మేరకు డబ్బులు ఖర్చవుతాయని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేయడం జరుగుతుంది. వారి అంచనాల ఆధారంగానే ప్రభుత్వం నిధులను కేటాయించి ఎస్ఎంసీ కమిటీలకు నిధులు విడుదల చేసి మరమ్మతు పనులు చేయించడం జరుగుతుంది.
రంగారెడ్డి జిల్లాలో రూ. 200కోట్లతో బడుల్లో మౌలిక వసతుల కల్పన
విద్యారంగంలో సమూ ల మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సర్కారు బడులను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200కోట్లు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లాలో 1300 ప్రభుత్వ స్కూళ్లలో 1.57.876లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
రూ. 34.67కోట్లతో బడుల్లో ఫర్నిచర్ ఏర్పాటు
జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 34.67 కోట్లతో అవసరం ఉన్న పాఠశాలల్లో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. మండలాల వారీగా పాఠశాలల్లో ఫర్నిచర్ కోసం కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి రూ. 256.44 లక్షలు, అమన్గల్లుకు రూ.63.56 లక్షలు, బాలాపూర్‌కు రూ.192.88లక్షలు, చేవెళ్లకు రూ. 94 లక్షలు, చౌదరిగూడెనికి రూ. 88.64 లక్షలు, ఫరూఖ్‌నగర్‌కు రూ. 218.24 లక్షలు, గండిపేటకు రూ.144.88 లక్షలు, హయత్‌నగర్‌కు రూ.90లక్షలు, ఇబ్రహీంపట్నానికి రూ.77.36 లక్షలు, కడ్తాల్‌కు రూ. 82.04 లక్షలు, కందుకూర్కు రూ.88.08 లక్షలు, కేశంపేట్కు రూ.99.44లక్షలు, కొందుర్గుకు రూ.76.28 లక్షలు, కొత్తూర్‌కు రూ. 58.80 లక్షలు, మాడ్గులకు రూ.137.48 లక్ష లు, మహేశ్వరానికి రూ.124.52 లక్షలు, మం చాలకు రూ. 52.76 లక్షలు, మొయినాబాద్‌కు రూ.129.48 లక్షలు, నందిగామకు రూ. 67.36 లక్షలు, రాజేంద్రనగర్‌కు రూ.267 లక్షలు, సరూర్‌నగర్‌కు రూ.157.84 లక్షలు, శేరిలింగంపల్లికి రూ.342.48 లక్షలు, షాబాద్‌కు రూ.114.36 లక్షలు, శంషాబాద్‌కు రూ. 132.32లక్షలు, శంకర్‌పల్లికి రూ.110.88 లక్షలు, తలకొండపల్లికి రూ.89 లక్షలు, యాచారం మండలానికి రూ.111.44 లక్షలతో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
సర్కార్ బడులు మరింత బలోపేతం
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవడం శుభపరిణామం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులను కల్పించడంతో పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయలేదు. సీఎం కేసీఆర్ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కృషి చేయడం సంతోషకరం.
–ఈదుల నర్సింహులుగౌడ్, నాగరగూడ(షాబాద్)