ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
రూ. 40 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
రూ. 25 లక్షలతో చెత్త సేకరణ ఆటోల కొనుగోలు
కొత్తూరు, జనవరి 29 : మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వార్డులో రూ.40 లక్షలతో డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. అంతే కాకుండా మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిధులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. స్థల సమస్య వల్ల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించలేకపోతున్నామని చెప్పారు. మున్సిపాలిటీలో ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అనుమతి తప్పకుండా తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఇండ్లు నిర్మిస్తే సమస్యలు వస్తాయన్నారు.
చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం రూ. 25 లక్షలతో ఆటో రిక్షాలను కొనుగోలు చేశారు. ఈ ఆటోలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. మున్సిపాలిటీలో ఇరుకైన సందులు ఉన్నందు వల్ల ప్రతి గల్లీకి ట్రాక్టర్ వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. అందుకోసం ఆటోలు కొనుగోలు చేశామన్నారు. ఈ ఆటోలతో ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించడం సులభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, చంద్రకళ, సోమ్లానాయక్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయాదవ్, మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష
కొత్తూరు రూరల్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో కొత్తూరు ఎంపీటీసీ-4 జగన్మోహన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కోఆప్షన్, ఎంపీటీసీ నిధుల నుంచి మంజూరైన రూ.4 లక్షల నిధులతో గ్రామం లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, మాజీ సర్పంచ్ మెండె నర్సింహ, ఉపసర్పంచ్ హేమలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు విజయపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, డైరెక్టర్ సాయిలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
కేశంపేట : నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్‌ఫండ్ వరంగా మారిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని పాపిరెడ్డిగూడకు చెందిన మంగమ్మకు రూ. 25 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.