
ఉపగ్రహ చిత్రాల ద్వారా పోడు భూముల హద్దుల గుర్తింపు
మెదక్ జిల్లాలో 4865 ఎకరాల పోడు భూములు,3032 దరఖాస్తులు
సంగారెడ్డి జిల్లాలో 7009 ఎకరాలు, 3934 దరఖాస్తులు
సాంకేతికత సర్వే ఆధారంగా అర్హుల గుర్తింపు
పక్కాగా ప్రక్రియ చేపడుతున్న అధికారులు
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/మెదక్, నవంబర్ 28 : పోడు భూముల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. డిజిటల్‌తో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా హద్దులను గుర్తించేందుకు సిద్ధమైంది. ఎన్టీఆర్ఎస్ఏ కార్డు శాట్ ద్వారా తీసిన చిత్రాలను పరిశీలించి, ఏ అటవీ భూమి ఎప్పుడు పంట పొలంగా మారింది..? ఎక్కడ కబ్జాకు గురైందన్న వివరాలను అధికారులు గుర్తించనున్నారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులు 2005 కంటే ముందు నుంచి, గిరిజనేతరులు 1930 నుంచి సాగులో ఉన్నట్లు ఆధారాలుండాలి. కాగా, మెదక్ జిల్లాలో 4865 ఎకరాల పోడు భూములు ఉండగా, 3032 దరఖాస్తులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 7009 ఎకరాల పోడు భూములుండగా, మొత్తం 3934 దరఖాస్తులు వచ్చాయి.
పోడుభూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా సర్వే నిర్వహించి, డిజిటల్‌తో పాటు శాటిలైట్ సర్వే ప్రామాణికంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుతం అటవీశాఖ ఎన్టీఆర్ఎస్ఏ కార్డు శాట్ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తీస్తోంది. దీని ప్రకారం ఏ అటవీభూమి ఎప్పుడు పంట పొలంగా మారింది..? ఎక్కడ కబ్జాకు గురైందన్న వివరాలు తెలియనున్నాయి. అలాగే, సమీప రైతులను కూడా సాక్షులుగా తీసుకుని, వారు తెలియజేసే వివరాలను అధికారులు రికార్డు చేయనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, సర్వే లాండ్ రికార్డ్స్, అటవీ, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ అధికారుల సమక్షంలో పోడుభూముల సర్వే నిర్వహించి గ్రామాల వారీగా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా 7009 ఎకరాలు..
అటవీశాఖ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఈ నెల 18వ వరకు దరఖాస్తులు స్వీకరించారు. పోడు భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలని సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3934 దరఖాస్తులు వచ్చాయి. పది మండలాలు, పది గ్రామాల్లో 37 గ్రామ పంచాయతీల పరిధిలో 7009 ఎకరాలను సాగుచేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 2168 మంది గిరిజనులు 4129 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. అలాగే 1766 మంది గిరిజనేతరులు 2980 ఎకరాలపై హక్కులు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.
మెదక్ జిల్లాలో 3032 దరఖాస్తులు..
మెదక్ జిల్లాలో 4865 ఎకరాల్లో పోడు భూములున్నాయి. 3032 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 914 మంది ఎస్టీలు 1412 ఎకరాల కోసం దరఖాస్తులు వచ్చాయి. 3445 ఎకరాలకు ఇతరులు (ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ)లు 2118 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపగ్రహ చిత్రాల సర్వే ద్వారా 2005 సంవత్సరానికి ముందు అటవీ శాఖ భూములు ఎన్ని, పోడు భూములు ఎన్ని, ఎంత వరకు కబ్జా అయ్యాయి. ఆ తర్వాత ఎంత ఆక్రమణకు గురైందన్న విషయాలను తెలుసుకోవడంలో ఈ సర్వే కీలకపాత్ర పోషిస్తుందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ సర్వేలో ఏది అటవీ, ఏది రెవెన్యూ భూమి, ఏ వ్యక్తి ఆధీనంలో ఎంత భూమి ఉందన్న విషయం తెలియడం లేదు. అయితే, పాత రికార్డుల ఆధారంగా వాటికి సంబంధించి అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది.
సాంకేతికత ఆధారంగా అర్హులకు న్యాయం..
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులు 2005 కంటే ముందు నుంచి, గిరిజనేతరులు 1930 నుంచి సాగులో ఉన్నట్లు అధారాలుండాలి. గ్రామ, సబ్ డివిజన్, డివిజన్ స్థాయి కమిటీలు వీటిని పరిశీలిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన కోసం గ్రామస్థాయి కమిటీల్లో అటవీ, గిరిజన, రెవెన్యూ తదితర శాఖలకు చెందిన వారుంటారు. సర్వేలో భాగంగా వచ్చిన దరఖాస్తులపై అధికారులు సమగ్ర సర్వే జరుపుతారు. తరువాత రైతులు అందజేసిన అఫిడవిట్‌కు అనుగుణంగా భూ సర్వే చేస్తారు. ఇందుకోసం 2005, 2006 అక్టోబర్, నవంబర్ అటవీశాఖ ఉపగ్రహాల ద్వారా తీసిన అడవుల ఛాయాచిత్రాలను పరిశీలించి, అటవీ భూములను తొలిగించి, భూములను సాగు చేస్తున్న వారి వివరాలను పరిశీలిస్తారు. దరఖాస్తుల్లో ఎవరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నది వివరాలు తెలియజేశారు. ఈ వివరాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సరిపోల్చి తద్వారా అర్హులకు న్యాయం చేయవచ్చని అధికారులు అంటున్నారు.