గుండాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు
దాతల సహకారంతో 30 ఏండ్ల కింద నిర్మాణం
బెంచీలు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటు
గ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణం
‘మన ఊరు-మనబడి’తో మరిన్ని వసతులు
షాబాద్, జనవరి 28: సకల సౌకర్యాలు.. నాణ్యమైన విద్య.. పచ్చందాల లోగిళ్లతో కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడుతున్నది చేవెళ్ల మండలం గుండాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దాతల సహకారంతో 30 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల నేడు ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది. ఇప్పటికే ఇక్కడ 6,7 తరగతులకు ఆంగ్లంలో బోధిస్తుండడంతో ఏడాది ఏడాదికి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గతేడాది 80 మంది విద్యార్థులుండగా.. ఈసారి 120 మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లు, మొక్కలతో ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణమే కనిపిస్తున్నది. దాతల సహకారంతో బెంచీలు, వాటర్ ఫిల్టర్, ప్రహరీ, మరుగుదొడ్లు, గదుల్లో బండలు, కిటికీలు, తలుపులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం సర్కార్ చేపడుతున్న ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియం బోధన అందించనున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నది. దాతల సహకారంతో నిర్మించిన ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతేడాది 80 మంది ఉన్న విద్యార్థులు ఈ ఏడాది 120కి పెరిగారు. ఇప్పటికే ఈ పాఠశాలలో 6,7 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. ఆ పాఠశాలే చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలోని జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ప్రభుత్వ కృషికి తోడు.. దాతల సహకారంతో పాఠశాల ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మరిన్ని మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభం కానుండగా విద్యార్థులకు మరింత మేలు జరుగనుంది.
ఆదర్శం గుండాల జడ్పీహెచ్ఎస్..
చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో గత 30 ఏండ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దాత శంకర్‌రెడ్డి పాఠశాల ఏర్పాటు కోసం సొంతంగా ఎకరంన్నర పొలాన్ని ఇవ్వగా ఆ స్థలంలో ప్రభుత్వం పాఠశాల భవనాన్ని నిర్మించింది. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదోతరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఏడాది కొంతమంది దాతలు కూడా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ యాదగిరి కృషితో నగరానికి చెందిన భాగ్యనగరం వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతేడాది రూ.3లక్షలతో పాఠశాల రెండో అం తస్తులోని గదుల్లో బండలు, కిటికీలు, తలుపులను ఏర్పాటు చేయించారు. ఈ ఏడాది మరో రూ.2లక్షలతో విద్యార్థులకు బెంచీల వితరణ, పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహం, ఆవరణ చుట్టూ ప్రహరీ, మరుగుదొడ్లను ఏర్పాటు చేయించారు.
గ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణం
హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణం, పరిసరాల్లో వివిధ రకాలకు చెందిన సుమారు 1000 మొక్కలను నాటగా, అవి ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన గ్రీనరీ ఆకట్టుకుంటున్నది. వివిధ రకాల పండ్ల జాతి మొక్కలతోపాటు కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పాఠశాల ఆవరణలో పండిన కూరగాయలను వండి పెడుతున్నారు. పాఠశాల పరిసరాలు పచ్చదనా న్ని సంతరించుకోవడంతో గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ఈ స్కూల్లోనే చేర్పిస్తున్నారు.
రూ.40 వేలతో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు..
గుండాల పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా గత నాలుగేండ్లుగా పనిచేస్తున్న యాదగిరి పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సొంత డబ్బులు రూ.40వేలతో పాఠశాలలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన తాగునీటిని అందిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు పక్క గ్రామాలైన అల్లవాడ, జాలాగూ డ, లక్ష్మీగూడ గ్రామాల నుంచి విద్యార్థులను రప్పించేందుకు తన సొంత డబ్బులతో ఆటోలను ఏర్పాటు చేశారు. ఉదయం ఆటోల్లో విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చి సాయంత్రం సమయంలో ఇంటికి తరలించేవాడు. పాఠశాల తరగతి గదులపై జాతీయ నాయకుల ఫొటోలను వేయించారు. గదుల్లో విద్యుత్ సరఫరాతోపాటు ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు.
ప్రైవేట్‌కు దీటుగా బోధన
పాఠశాలలో ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాం. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పాఠశాల పరిసరాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. పలువురు దాతలు విద్యార్థులకు బెంచీలు, ఫర్నిచర్‌ను అందించారు. ఇప్పటికే తమ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కిం ద ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. –శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, గుండాల పాఠశాల