తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
బషీరాబాద్, జనవరి 28 : సొంత మండలమైన బషీరాబాద్‌కు అధిక ప్రాధాన్యమిస్తానని, మండలంలోని బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నవల్గా, వాల్యానాయక్‌తండాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్నేండ్లుగా తాగునీటికి ఇబ్బందులున్న నవల్గా గ్రామంలో రూ. 38.94 లక్షలతో రెండు ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. దీంతో శాశ్వతంగా తాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు. అలాగే మండలంలో పాడైన బీటీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రూ.రెండు కోట్ల నిధులతో మైల్వార్-కంసాన్పల్లి, నవల్గా-మైల్వార్, కాశీంపూర్-బాద్లాపూర్-గొట్టిగకలాన్, కొర్విచేడ్, పర్వత్‌పల్లి గ్రామాల బీటీ రోడ్ల మరమ్మతులు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకుపెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజుగౌడ్, నర్సిరెడ్డి, రాజారత్నం, మునీందర్‌రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్, పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సర్పంచ్‌లు లాలూ, సూర్యానాయక్, దేవ్‌సింగ్, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీబాయి, స్థానిక నాయకులు రాజు, భాను, రవి, వెంకట్, పాల్గొన్నారు.