పురుషులకు గ్రీన్ కలర్ షర్ట్, ఖాకీ కలర్ ప్యాంట్
మహిళలకు స్కై బ్లూ రంగు చీరె
క్రమశిక్షణ, సముచిత గౌరవం కల్పించేలా కలెక్టర్ చొరవ
ఇక్కత్ వస్ర్తాలతో చేనేత కార్మికులకూ ఉపాధి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కొవిడ్ కష్టకాలంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం వారు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. అలాంటి స్వచ్ఛ కార్మికుల్లో నూతనోత్సాహం, ఆత్మైస్థెర్యం నింపేలా జిల్లాలో కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రీన్ కలర్ షర్ట్, ఖాకీ ప్యాంట్‌తో పురుషులు, ఎర్ర అంచు స్కై బ్లూ చీరెలతో కార్మికులు విధుల్లో సరికొత్తగా కనిపిస్తున్నారు. అంగీల కోసం సింగిల్ ఇక్కత్ క్లాత్‌ను వినియోగించడం ద్వారా చేనేత కార్మికులకూ ఉపాధి దొరుకుతున్నది. న్యూ డ్రెస్ కోడ్ విషయంలో కలెక్టర్ పమేలా సత్పతి చూపిన చొరవకు కార్మికులతోపాటు అధికార వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 421 గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులందరికీ రెండు జతల చొప్పున అందించగా, ఇప్పటికే చాలాచోట్ల కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది.
పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో వారు అందించిన సేవలు ప్రశంసనీయం. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త డ్రెస్ కోడ్‌తో సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని కలిగించడంతోపాటు ఆత్మైస్థెర్యంతో పనిచేసేలా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మూడు నెలల క్రితం కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్ ఇటీవల కార్యరూపంలోకి తెచ్చారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 421 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందితోపాటు, ఇతర విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ కొత్త డ్రెస్‌కోడ్‌కు సంబంధించిన దుస్తులను అందజేశారు. పురుషులకు గ్రీన్ కలర్ షర్ట్, ఖాకీ ప్యాంట్.. మహిళలకు ఎరుపు జరీ అంచుతో కాటన్, పాలిస్టర్ కలగలిసిన స్కై బ్లూ కలర్ చీరె, అదే రంగుతో కూడిన బ్లౌజ్‌ను యూనిఫామ్‌గా అందించారు. ఇప్పటికే చాలా చోట్ల అమల్లోకి వచ్చిన డ్రెస్‌కోడ్‌తో సిబ్బంది కొంగొత్తగా, ఆకర్షణీయంగా కన్పిస్తున్నారు.
చేనేత ఖ్యాతిని చాటేలా..
చేనేత వస్ర్తాలకు తగిన ప్రాశస్త్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల్లో ఉద్యోగులు, సిబ్బంది చేనేత వస్ర్తాలను ధరించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. కలెక్టర్ పమేలా సత్పతి సైతం కొత్తగా అమలు చేస్తున్న డ్రెస్‌కోడ్‌లో చేనేత వస్ర్తాలను చేర్చారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడేనికి చెందిన హ్యాండ్లూమ్ వీవర్స్ సొసైటీకి చేనేత వస్ర్తాలను నేసే బాధ్యతను అప్పగించారు. పురుషులు ధరించే షర్ట్‌కు సంబంధించిన క్లాత్‌ను సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఒక్కో మగ్గంపై రోజుకు 20-30మీటర్ల క్లాత్‌ను మాత్రమే నేసే వీలుండడంతో చేనేత కార్మికులు రెండు నెలల పాటు శ్రమించి 6వేల మీటర్ల గ్రీన్ కలర్ క్లాత్‌ను నేశారు. క్లాత్‌కు సంబంధించిన నూలును తెప్పించి ప్రత్యేకంగా డిజైన్చేయించారు. క్లాత్ తయారీకి సుమారు రూ.7లక్షల వరకు ఖర్చుకాగా.. 200 మంది కార్మికులకు ఉపాధి సైతం లభించింది. ఖాకీ ప్యాంట్ క్లాత్, మహిళలకు అందజేసిన చీరెలను టెస్కోకు ఇండెంట్ పెట్టి తెప్పించారు. ఎరుపు రంగు జరీ అంచుతో రూపుదిద్దుకున్న చీరెతోపాటు, పురుషులు ధరిస్తున్న షర్ట్ క్లాత్ డిజైన్ కోసం కలెక్టర్ పెద్ద కసరత్తు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ రెండు జతలు
ప్రభుత్వం ప్రతియేటా మున్సిపల్, పంచాయతీ కార్మికులకు రెండు జతల దుస్తులను అందజేస్తూ వస్తున్నది. పురుషులు ఎక్కువగా ఖాకీ కలర్ దుస్తులు, మహిళలు ఎవరికి తోచినట్లుగా వివిధ రంగుల చీరెలను ధరిస్తూ వస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనతో కలెక్టర్ కొత్త డ్రెస్‌కోడ్ అమలుకు పూనుకున్నారు. ఒక్కో చీరెకు రూ.350, ప్యాంట్ క్లాత్‌కు రూ.476, షర్ట్ క్లాత్‌కు రూ.585 చొప్పున వెచ్చించారు. కొలతలు ఇబ్బందులు లేకుండా కార్మికులకే వస్ర్తాలను ఇస్తున్నారు. కుట్టుకూలిని సైతం ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలే చెల్లిస్తున్నాయి. పంచాయతీల పరిధిలో 1100 చీరెలను, మున్సిపాలిటీల పరిధిలో 500 చీరెలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పంచాయతీల్లో పనిచేస్తున్న 1,333 మంది పురుషులకు, మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న 240 మంది సిబ్బందికి షర్ట్, ప్యాంట్లను అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ రెండు జతల చొప్పున ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. నిత్యం విధిగా డ్రెస్‌కోడ్‌ను పాటించి విధులకు హాజరయ్యేలా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో మానిటరింగ్ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
బాగుందని అంటున్నరు..
ఇంతకుముందు ఎవరికి వారు ఇష్టమొచ్చిన చీరెలను ధరించే వాళ్లం. ఇప్పుడందరం ఒకే రంగు చీరెలను ధరించడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాం. చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నరు. ప్రతి ఒక్కరికీ రెండు జతల చీరెలను ఇచ్చిండ్రు. మాకు కల్పించిన గౌరవంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తాం.
-పొట్ట యాదమ్మ, పారిశుధ్య కార్మికురాలు, బీబీనగర్ గ్రామ పంచాయతీ
సముచిత గౌరవం
చేనేత షర్ట్‌లను అందించి మాకు మంచి గౌరవం కల్పించారు. ఇంతకుముందు ఖాకీ షర్ట్, ప్యాంట్‌ను ధరించేవాళ్లం. ఖాకీ పాయింట్ మీదికి గ్రీన్ కలర్ షర్ట్ చూడడానికి బాగుంది. సౌకర్యవంతంగా ఉంది. క్రమశిక్షణతో ఆత్మైస్థెర్యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.
-చల్ల రాజయ్య, పారిశుధ్య కార్మికుడు, భువనగిరి మున్సిపాలిటీ