ఇబ్రహీంపట్నం డివిజన్లో సక్సెస్ బాటలో పంటకాలనీలు
కొత్తగా చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
డ్రిప్, పందిరి, స్ప్రింక్లర్లు, నాణ్యమైన నారు, మల్చింగ్లకు సర్కారు సబ్సిడీ
నగరానికి కూరగాయలు అందించడంలో జిల్లాదే కీలక పాత్ర
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27: క్రాప్కాలనీల్లో చేస్తున్న కూరగాయల సాగు రంగారెడ్డి జిల్లా రైతన్నలకు కాసులు కురిపిస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్న అన్నదాతలు నగరానికి కూరగాయలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో ఇబ్రహీంపట్నం డివిజన్లో ఏర్పాటు చేసిన పంటకాలనీలు సక్సెస్ బాటలో పయనిస్తున్నాయి. టమాట, వంకాయతో పాటు తీగజాతి కూరగాయలు కాకర, బెండ, సొరకాయ, బీర, దొండకాయ, చిక్కుడు తోటల సాగుతో లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో జిల్లాలో కొత్తగా చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలోనూ పంటకాలనీల ఏర్పాటుకు ఉద్యానవనశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వమే నేరుగా నాణ్యమైన నారును అందించడంతో పాటు పందిరి, స్ప్రింక్లర్లు, డ్రిప్, మల్చింగ్ వంటివాటికి సబ్సిడీ అందిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటల్లో భాగంగా మరిన్ని క్రాప్ కాలనీలను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి జిల్లా నుంచే అత్యధికంగా కూరగాయలను ఎగుమతి చేసేందుకు జిల్లా ఉద్యానవనశాఖ సిద్ధమవుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్కు జిల్లా నుంచే అత్యధికంగా కూరగాయలను ఎగుమతి చేస్తున్నారు. అందులో భాగంగానే మరింత కూరగాయల సాగును ప్రో త్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డివిజన్లో పంట కాలనీలను ఏర్పాటు చేసిన రైతులకు ఉద్యానవనశాఖ నుంచి అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందుతుండటంపై కూరగాయల దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో పలువురు రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించారు. అలాగే, మార్కెట్లో ఈ కూరగాయలకు మంచి డిమాండ్ ఉండటంతో ఇబ్రహీంపట్నం డివిజన్లో పంట కాలనీలు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం డ్రిప్, పందిరి, స్ప్రింకర్లు, నాణ్యమైన నారును సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నది.
చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలో ఏర్పాటుకు..
ఇబ్రహీంపట్నం డివిజన్లో ఐదేండ్ల క్రితం నుంచే పంటకాలనీలను ప్రవేశపెట్టడంతో రైతులు ఎక్కువగా కూరగాయలను సాగు చేస్తూ ప్రతిరోజూ చేతినిండా డబ్బులను చూస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో పంట కాలనీల ఏర్పాటు విజయవంతం కావడంతో ఉద్యానవనశాఖ చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలోనూ పంట కాలనీలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ రెండు డివిజన్లలో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేసి రైతులు ఆరుతడి పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. పంట కాలనీల్లో టమాట, వంకాయ, కాకర, బెండ, సోరకాయ, బీర, దొండకాయ, చిక్కుడు వంటి తోటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. క్రాప్ కాలనీల కింద పంటలు వేసుకున్న రైతులకు మంచి దిగుబడి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కొత్తగా 10వేల ఎకరాల్లో ..
జిల్లాలో వరికి బదులుగా యాసంగి సీజన్లో చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలో పది వేల ఎకరాల్లో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న కూరగాయల సాగుకు అదనంగా ఈ పదివేల ఎకరాల్లో కూరగాయలను సాగు చేసేందు కు చర్యలు తీసుకుంటున్నది. ఇబ్రహీంపట్నం డివిజన్ లో ప్రస్తుతం 10 నుంచి 20 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. ముందుగా క్రాప్కాలనీల కోసం కూరగాయలను పండించే గ్రామాలను ఎంపికచేసి ఆయా గ్రామాల్లోని రైతులకు తగు సూచనలు, సలహాలు అందించనున్నారు. అదేవిధంగా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తుంది. కూరగాయ లు సాగుచేసే గ్రామాలకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కల్పించటంతోపాటు మార్కెట్కు తరలించిన కూరగాయలను రైతులు విక్రయించేందుకు సహకరిస్తుంది.
అదనపు క్రాప్కాలనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లాలో కూరగాయల సాగును మరింత పెంచేందుకు మరిన్ని క్రాప్ కాలనీల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డివిజన్లో క్రాప్కాలనీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని షాద్నగర్, చేవెళ్ల డివిజన్లలోనూ ఈ యాసంగి నుంచి కొత్తగా క్రాప్కాలనీలను ఏర్పా టు చేయాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగా నే ఆ రెండు డివిజన్లలో కొత్తగా క్రాప్కాలనీలు ఏర్పాటుచేస్తాం.
క్రాప్ కాలనీల ఉద్దేశం..
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన ప్రాంతం నుంచి సరిపడా కూరగాయలు సరఫరా కావడంలేదు. దీంతో నగరానికి బెంగళూరు నుంచి టమాట, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాం తాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కు సరిపడా కూరగాయలను ఈ ప్రాంతంలోనే పండించాలని నిర్ణయించింది. నగర శివారులో రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండటంతో ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కూరగాయల సాగును మరో మూడు రేట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం డివిజన్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పంట కాలనీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్దేశం సత్ఫలితాలివ్వడంతో దీనిని చేవెళ్ల, షాద్నగర్ డివిజన్లలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కూరగాయలు పండించే రైతులను గుర్తించి అధిక దిగుబడులు సాధించేందుకు వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి డ్రిప్ పరికరాలు, క్రాప్కాలనీల్లో భాగంగా టమాట, వంకాయ, దొండ, బీరకాయ లాంటి తోటల కోసం ప్రభుత్వమే నాణ్యమైన నారును రైతులకు సబ్సిడీపై అందజేస్తున్నది.