తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
ఖైరతాబాద్, డిసెంబర్ 27 : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమిచ్చారో స్పష్టం చేయాలి. ఇక్కడ కాదు.. ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించారని, ఇప్పటివరకు 14 కోట్ల ఉద్యోగాలు రావాలని, ఎన్ని ఉద్యోగాలిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ దీక్షలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏమిచ్చారో ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌చుగ్ చెప్పాలన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు ఏ మేరకు అమలు చేశారో బండి బదులు చెప్పాలన్నారు. దేశంలోనే అతి పెద్ద సంస్థ రైల్వేను ప్రైవేట్‌పరం చేశారన్నారు. వేలకోట్ల లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, బ్యాంకులను ఎందుకు ప్రైవేట్ పరం చేశారని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రైవేటీకరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అనేక శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసిందని, దళిత, రైతుబంధు లాంటి పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. బండి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు నమ్మరన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరాలన్నారు. కేంద్రం చెప్పిన విధంగా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నామన్నారు.