బూత్ లెవల్ ఆఫీసర్లు గరుడ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్
పరిగి, నవంబర్ 27 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ సూచించారు. శనివారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు సవరణలపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయెల్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా తయారులో బీఎల్వోల పాత్ర ముఖ్యమైందని తెలిపారు. బీఎల్వోలు తప్పనిసరిగా గరుడ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి వివరాలు సేకరించి వారి పేర్లు జాబితాలో నుంచి తొలగించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు ఉండేలా చూడాలని చెప్పారు. బీఎల్వోలు విధులు, గరుడ యాప్ ద్వారా ఆన్లైన్ సేవలు నిర్వహించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, దీంతో తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధమవుతుందని పేర్కొన్నారు. దరఖాస్తులన్నీ ఆన్లైన్ ద్వారా వచ్చేలా చూడాలని, హార్డ్ కాపీలుగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాల్సిందిగా శశాంక్ గోయెల్ ఆదేశించారు.
ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించాలి
అనంతరం సంగెం లక్ష్మీబాయి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ సెంటర్లలో బీఎల్వోల ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గరుడ యాప్‌లో ఓటరు నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సంగెం లక్ష్మీబాయి పాఠశాలలోని కేంద్రంలో బీఎల్వోలకు గరుడ యాప్‌లో నమోదు తెలియకపోవడంతో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గరుడ యాప్ వినియోగం వల్ల పనుల్లో పారదర్శకతతోపాటు పనుల్లో సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈవీఎం, వీవీ ప్యాడ్ స్టోరేజీ గోదామును జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదాములో ఈవీఎంల కమీషనింగ్ కోసం మొదటి అంతస్తులో రూ.55లక్షలు మంజూరు చేయించాలని అధికారులు కోరగా.. సానుకూలంగా స్పందించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శశాంక్ గోయెల్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్, స్వీప్ నోడల్ ఆఫీసర్ కోటాజీ, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ పుష్పలత, తహసీల్దార్లు ఉన్నారు.