అన్నా అంటే.. నేనున్నా అనే మనస్తత్వం
నిరంతరం జనం కోసం తపిస్తూ.
అతి చిన్న వయస్సులోనే ప్రజా ప్రతినిధిగా ఎన్నికై
షాబాద్ ప్రాంత అభివృద్ధికి బాటలు
షాబాద్, డిసెంబర్ 26;అటు సమస్యల పరిష్కారంతో పాటు.. ఇటు పేదలు, దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సేవా కార్యక్రమాలు అందిస్తూ.. షాబాద్ ప్రాంత అభివృద్ధిని కాంక్షించడమే కాకుండా యువత కోసం జిల్లా, మండలస్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించి వారిలో నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే నేతగా నిలుస్తూ.. షాబాద్ మండల అభివృద్ధి కోసం నిరంతరం తపిన్తున్నారు యువనేత జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి.
కరోనా కాలంలో..
కరోనా మహమ్మారి కబలిస్తున్న తరుణంలో షాబాద్ మండలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు, ప్రజలకు అండగా నిలిచేందుకు జడ్పీటీసీగా పట్నం అవినాశ్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పోలీసులకు శానిటైజర్లు తదితరాల కోసం రూ.50వేల విరాళం అందించారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పేదలకు సొంత డబ్బులు రూ.10లక్షలతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆశ వర్కర్లు, వైద్య సిబ్బందికి త్వరలో ప్రోత్సాహకాలను అందించనున్నట్లు చెప్పారు.
పీఆర్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో..
మండలంలోని పేదలు, దివ్యాంగులు, వృద్ధులకు పీఆర్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అవినాశ్‌రెడ్డి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గతంలో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ దవాఖానలో ఉచిత చికిత్సల కోసం కృషి చేశారు.
ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం..
సీతారాంపూర్‌కు చెందిన నిరుపేద మంగళి రాజు కుమారుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, తనవంతు ఆర్థిక సాయంగా జడ్పీటీసీ రూ.లక్ష అందజేశారు. అలాగే పలు గ్రామాల్లో ప్రజలకు ఆపత్కాల పరిస్థితుల్లో, వివాహాలకు, కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి అన్న అంటే నేనున్నా అంటూ.. భరోసా కల్పించారు.
దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి(తండ్రి)కి తగ్గ తనయుడిగా నిరంతరం ప్రజా సేవకు షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారు. చిన్న వయస్సులోనే క్రికెట్లో దాదాపు రంజిస్థాయికి చేరుకున్నారు. అదే సమయంలో షాబాద్ ఎంపీపీగా ఉన్న బాబాయ్ పట్నం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆ స్థానం పూర్తి చేయడం కోసం పట్నం కుటుంబ వారసుడిగా అవినాశ్‌రెడ్డి సమైక్య రాష్ట్రంలో అతి చిన్న వయస్సులో ఎంపీపీ పదవిని స్వీకరించి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అనంతరం షాబాద్ సహకార సంఘం చైర్మన్ పదవిని నిర్వహించి, ప్రస్తుతం జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధిగా పదవులను అలంకరిస్తూ టీఆర్ఎస్ పార్టీలో, యువజన విభాగంలో జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధించేందుకు అవినాశ్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు. జడ్పీటీసీగా గెలిచిన నాటి నుంచి మండలంలోని 41 గ్రామపంచాయతీలు, వాటి పరిధిలోని 62 గ్రామాలను కనీసం మూడుసార్లు చుట్టేశారంటే ఆయన మండలంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఓ వైపు ప్రజాప్రతినిధులను, మరోవైపు మండల స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నారు.
విద్యార్థులు, యువతకు క్రీడా నైపుణ్యం కోసం..
తండ్రి పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయసాధనకు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, యువకులకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవినాశ్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ప్రతి ఏడాది రాజేందర్‌రెడ్డి స్మారక జిల్లాస్థాయి క్రికెట్, వాలీబాల్ పోటీలతో పాటు స్థానికంగా విద్యార్థులు, యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించి వాటి అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. పీఆర్ఆర్ స్టేడియం పునరుద్ధరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నట్లు అవినాశ్‌రెడ్డి చెబుతున్నారు.
తారకరాముడి తమ్ముడిగా..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంటే తనకు అమితమైన స్ఫూర్తి అని పేర్కొంటూ, పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. కేటీఆర్ కార్యక్రమాలంటే భారీగా కార్యకర్తలు, నాయకులను ర్యాలీలకు తరలించి తన అభిమానాన్ని చాటుకుంటాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో యువతతో మరింత పటిష్టమవుతుందని అవినాశ్‌రెడ్డి చెబుతున్నారు. బాబాయ్‌లు ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిల సహకారంతో పార్టీ తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని అవినాశ్‌రెడ్డి తపిస్తున్నారు.
అభివృద్ధే అతడి ఆకాంక్ష..
వెనుకబడిన షాబాద్ మండలం అభివృద్ధి కోసం జడ్పీటీసీగా అవినాశ్‌రెడ్డి నిరంతరం తపిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో యూజీడీలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరుల సహకారంతో నిరంతరం నిధుల కోసం తపిస్తున్నారు. 30 ఏండ్ల సమస్యగా నిలిచిపోయిన కుమ్మరిగూడ-షాబాద్, రేగడిదోస్వాడ-తిర్మలాపూర్ లాంటి గ్రామాలకు భారీగా నిధులను తీసుకొచ్చి బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే పహిల్వాన్ చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ఆయన కృషి అవిరళమైనదని స్థానికులు చెబుతున్నారు.