
రచ్చబండ కార్యక్రమం కోసంmస్థల పరిశీలన చేసిన కాంగ్రెస్ నాయకులు
అడ్డుకున్న ఎర్రవల్లి గ్రామస్తులు
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 26 : రేవంత్రెడ్డి మా ఊరికి రావొద్దంటూ మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. సోమవారం ఎర్రవల్లి గ్రామంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లిలో స్థల పరిశీలన కోసం వచ్చారు. దీంతో ఎర్రవల్లి గ్రామస్తులంతా కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రేవంత్రెడ్డి.. మా ఊరికి రావాల్సిన అవసరం లేదన్నారు. తమ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు తెచ్చారని, అందరికీ పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా ఇలాంటి గొప్ప ప్రాజెక్టు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. అందుకే మా ఊరికి కాంగ్రెస్ వాళ్లు రావొద్దన్నారు. అన్నదమ్ముళ్ల లెక్క సంతోషంగా బతుకుతున్న మా ఎర్రవల్లి గ్రామస్తుల మధ్య కాంగ్రెస్ నాయకులు చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎర్రవల్లి గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.