
రెండోరోజూ వేలాదిగా వచ్చిన భక్తులు
భక్తులను ఆశీర్వదించిన గురువులు
మొక్కులు తీర్చుకున్న భక్తులు
చెట్ల కిందే వంటావార్పు
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 26 : రెండో రోజూ మెదక్ చర్చిలోభక్తుల సందడి నెలకొంది. క్రిస్మస్ అనంతరం భక్తులు తరలివెళ్తుండగా.. ఆదివారం కావడంతో కరుణామయుడి సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్ సుకుమార్ చర్చి గురువులు దయానంద్, రాజశేఖర్, డేవిడ్ భక్తులను ఆశీర్వదించారు. భక్తులకు చర్చిలోని వసతి గృహాలు, కాటేజీలు లభించకపోవడంతో చెట్ల కిందే వంటావార్పు చేసుకున్నారు. క్రిస్మస్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రంగుల రాట్నాలు చిన్నారులు, యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
చర్చిని సందర్శించిన నూతన ఎస్పీ
పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చర్చిని సందర్శించారు. చర్చి పరిసరాల ప్రాంతాల్లో బందోబస్తును డీఎస్పీ సైదులుతో కలిసి పరిశీలించారు. చర్చి ప్రాంగణంలో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.