
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లవాగు ప్రాజెక్టు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
సిర్గాపూర్, డిసెంబర్ 26 : నీటి పారుదల ఆయకట్టు కింద వరిని సాగు చేయొద్దని, ఆరుతడి పంటలే వేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు ద్వారా ఆరుతడి పంటల సాగు కోసం నీటిని వదిలారు. అంతకుముందు గంగామాతా జలాలకు ప్రత్యేక పూజలు చేసి తెప్పను వదిలారు. ప్రాజెక్టు కింద ఆరుతడి పంటలు వేసేందుకు గానూ గత వారం జిల్లా అధికారులతో ఎమ్మెల్యే చర్చించి రెండు ప్రధాన కాల్వల ద్వారా మొత్తం 5,100 ఎకరాల పంటలకు సాగు నీరందించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు బాగు పడాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనేందుకు సిద్ధం లేదని స్పష్టంగా చెబుతున్నదని, అందుకే ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుదారులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. సింగూర్ జలాలు ఖేడ్ ప్రాంతానికి తరలించేందుకుగానూ రూ.1.40 కోట్లతో తలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధి కోసం తెలంగాణ సర్కా రు ఎళ్లవేళలా కృషి చేస్తున్నదని కొనియాడారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ సభ్యులు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఏడీ ఏ కరుణాకరెడ్డి, డీఈఈలు జలంధర్, పవన్ కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణమూర్తి, ఏఈ లు, వైస్ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ గంగామణినర్సింహులు, సాయాగౌడ్, విజయ్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.