
బీజేపీ మంత్రులకు సేద్యమంటే తెలియదు
మంత్రి నిరంజన్‌రెడ్డి
కోడేరు, డిసెంబర్ 26: కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అన్నదాతల బాధలు అందుకే వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి చికిత్సా శిబిరాన్ని ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వరి సాగులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని తెలిపారు. వానకాలంలో 63.13 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరిస్తే అంత ఎలా సాగైందని ఎదురు ప్రశ్నించారని అన్నారు. అందుకే శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఎంత సాగైందని గుర్తించాలని సూచించగా.. వారంలోగా గుర్తిస్తామని చెప్పి కాలయాపన చేసి తీరా అంత కాదు 58లక్షల ఎకరాలే సాగై ఉండొచ్చని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి కొనుగోలు విషయంలో బీజేపీ సర్కారు మోకాలడ్డుతున్నదని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను పక్కకు నెట్టిన కేంద్రం వ్యాపార ధోరణిలో మొండి వైఖరి అవలంభిస్తున్నదని చెప్పారు. ధాన్యం నిల్వకు గోదాంలు లేవని చేతులు ఎత్తేస్తున్నదని దుయ్యబట్టారు. వ్యాపార దృక్పథంతోనే ఇతర రంగాలను సైతం ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.
కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరిక మేరకు కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం మామిడి మార్కెట్ కేంద్రాన్ని బహుమానంగా ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దక్షిణ తెలంగాణ మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నదన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఒక్కో జిల్లా గుర్తింపు పొందిన ఒక్కో ప్రొడక్ట్ పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. దీంతో మామిడి మార్కెట్ మంజూరైందని వెల్లడించారు. కోల్డ్‌స్టోరేజీలు, ప్యాక్‌హౌస్‌ల, ఇతర వారికి సర్కార్ నుంచి సబ్సిడీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, దీనికి తోడు సాగునీరు పుష్కలంగా ఉండడం, రైతుబంధు సాయంతో వ్యవసాయం పండుగలా జరుగుతున్నదని తెలిపారు. అన్నదాతకు పంట పెట్టుబడికి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. ఈ యాసంగి సీజన్‌కుగానూ 1.47 కోట్ల ఎకరాల భూ యజమానులు 63 లక్షల మంది రైతులకు రూ.7,650 కోట్లను రైతుబంధు కింద కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సాయం రెండు, మూడ్రోజుల్లో కర్షకుల బ్యాంక్ ఖాతాల్లో పడుతాయని చెప్పారు. కంటి దవాఖానకు వారి సొంత స్థలంలో పూర్తి స్థాయి నిర్మాణం జరిగేలా ఎమ్మెల్యేతో పాటు నా సహాయ, సహకారాలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, విండో చైర్మన్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌గౌడ్, రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీటీసీలు నర్సింహ, దేవమ్మ, ఎల్వీ స్రసాద్ కంటి దవాఖాన వైద్యులు ప్రతిమ విశ్వకర్మ, టీఆర్ఎస్ నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.