
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 26 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వలస కడుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగన్నపల్లి గ్రామంలో ఆయన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసరంగా ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అనంతరం కోయిల్‌సాగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ కార్యకర్త ఆంజనేయులును ఎమ్మెల్యే పరామర్శించారు. చింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామానికి చెందిన కురుమమ్మ, దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన కొండాపూర్ విజయ భాస్కర్‌రెడ్డి మృతి చెందగా ఎమ్మెల్యే బాధిత కుబుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. దేవరకద్రకు చెందిన చాకలి శ్రీను అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సింగిల్ విండో అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్ యాదవ్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, చల్మారెడ్డి పాల్గొన్నారు.