
సత్ఫలితాలిస్తున్న సర్కార్ ప్రణాళిక
విద్యా మండలంగా మారుతున్న ధన్వాడ
ధన్వాడ, డిసెంబర్ 26: చదువుకునే వయస్సులో బడిమానేసే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతుంది. పాఠశాలలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. విద్యకోసం సర్కార్ తీసుకున్న చర్యలు సత్ఫాలితాలు ఇస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ధన్వాడ మండలంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువును మధ్యలోనే మాన్పించి పనుల్లో పెట్టేవారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యేవారు. డ్రాపౌట్లను తగ్గించడం కోసం సర్కార్ మండలస్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించి పిల్లల తల్లిదండ్రులను చైతన్యవంతం చేసింది. మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికితోడు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లోనూ చదివిస్తూ విద్యాపరంగా పిల్లలను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య పెరిగింది. సర్కారు అందిస్తున్న సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపారు. ఈ విద్యా సంవత్సరం ధన్వాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ధన్వాడలో మోడల్ స్కూల్, కస్తూర్బా, కొండాపూర్ ఎస్టీ గురుకుల పాఠశాల, ధన్వాడ ప్రభుత్వ జూనియార్ కళాశాల, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల ఏర్పాటు వల్ల కూడా మండలంలో డ్రాపౌట్ తగ్గడం వల్ల ధన్వాడ మండలం విద్యా మండలంగా మారింది.
సర్కారు బడుల అభివృద్ధే ధ్యేయం
గత ప్రభుత్వ హయాంలో ఎం జరిగిందో కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. నాడు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించడానికి వెనుకాముందు ఆలోచించేవారు. ఇప్పుడు ప్రైవేట్ బడుల్లో కాకుండా తమ పిల్లలను సర్కారు బడికే పంపిస్తున్నారు.