
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాల రద్దీ
భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్
ఫుట్‌పాత్‌ను కబ్జా చేసిన దుకాణాదారులు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కోస్గి, డిసెంబర్ 26 : పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌పాత్‌కు కేటాయించిన స్థలాన్ని దుకాణదారులు కబ్జాచేయడంతో వాహనచోధకులు వాహనాలు నిలిపేందుకు స్థలంలేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. రోడ్లపై వాహనాలు నిలుపడంతో మహబూబ్‌నగర్ – చించోలి జాతీయ రహదారి వెంబడి వచ్చే పెద్ద వాహనాలు సైతం నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. కాగా, మున్సిపల్ అధికారులు జాతీయ రహదారి వెంబడి ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణదారులను తొలగిస్తే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్లపై వాహనాలు నిలబడటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వారాంతపు సంత కావడంతో సంతలో పోలీసులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పట్టణవాసులు, వాహనదారులు కోరుతున్నారు.
ఫుట్‌పాత్‌పై దుకాణాలు తొలగిస్తాం
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణాలను తొలగిస్తాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసులు, అధికారులు సహకరించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారమవుతుంది.