వివిధ మండలాల్లో క్రిస్మస్ వేడుకలు
ఏసు మార్గం ఆచరించాలని సూచన
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
ప్రార్థనలతో మార్మోగిన చర్చిలు
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25 : : నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలతో అందంగా అలంకరించారు. బైబిల్‌తో పాటుగా ప్రత్యేక గీతాలను ఆలపించారు. చర్చిల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవులు కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. క్రైస్తవులంతా ఉదయమే చర్చిలకు వెళ్లి క్రీస్తు శిలువముందు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఏస్తుక్రీస్తు జననంపై నాటికలు ప్రదర్శించి పలువురిని ఆకర్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చర్చిల్లో చిన్నపిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయపార్టీల నాయకులు, క్రైస్తవ మత పెద్దలు క్రిష్టియన్లకు ప్రభుత్వం తరపున కానుకలు అందజేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్,హయత్‌నగర్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో క్రిస్మస్ పండుగను నిర్వహించారు.
ఆమనగల్లు,కడ్తాల్, మాడ్గులలో..
ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, త్యాగం ఏసు క్రీస్తు జీవితం అందరికి బోధపడేలా చేసిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి ఆమనగల్లు క్రైస్తవులతో కలిసి వేడుకల్లో పాల్గొనగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాడ్గుల మండలంలోని కొత్తబ్రహ్మణపల్లి వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను అందరిని అలరించాయి. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గులలో వేడుకలు జరిగాయి. ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.