ఎకరా పొలంలో టమాట సాగు
సేంద్రియ ఎరువుల వాడకం
ఖర్చు ఆదా.. అధిక దిగుబడి
రైతులకు మార్గదర్శకంగా నర్సింహారెడ్డి
కొడంగల్, డిసెంబర్ 25 : పంట మార్పిడితో భూసారం పెరుగడంతో పాటు అధిక దిగుబడిని సాధించుకోవచ్చనే అవగాహన ఇప్పుడిప్పుడే రైతుల్లో ఏర్పడుతున్నది. ప్రతీసారి ఒకే పంటను వేస్తే తక్కువ దిగుబడితోపాటు భూసారం తగ్గిపోయి చీడ పీడల బాధ పెరిగి అధికంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుందనే విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేసేందుకు ఆసక్తిని పెంచుకుంటూ.. సేంద్రియ ఎరువుల వాడకం పట్ల దృష్టి సారిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూసారం పెరుగడం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అందివస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం వరికి బదులుగా ఇతరత్రా పంటల సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నది. మార్కెట్లో లాభాలు ఉన్న పంటలను పండించుకుంటే పంట అమ్మకాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది.
సేంద్రియ ఎరువులతో టమాట సాగు
మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన గోడల నర్సింహారెడ్డి ఎకరా పొలంలో సేంద్రియ ఎరువులతో టమాట సాగు చేస్తున్నాడు. గతంలో వరి, పత్తి పంటలను సాగు చేశానని, అధిక పెట్టుబడులతోపాటు వాతావరణ పరిస్థితుల కారణంగా పంటనష్టం ఏర్పడటం, కూలీల కొరత, పంట అమ్మడానికి తదితర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. ప్రతి రోజూ అవసరమయ్యే కూరగాలను పండించుకుంటే రోజువారీగా ఆదాయాన్ని గడించుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో అధిక దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. తద్వారా ఆర్థికంగా లాభాలు ఆర్జించినప్పటికీ, ఆరోగ్యపరంగా ఎంత నష్టపోతున్నామనేది గమనించడం లేదన్నారు. కొంతవరకైనా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు అవగాహన కల్పించుకుంటే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయనేది గమనించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందిస్తే సమాజానికి మన వంతు ఆరోగ్యాన్ని అందించిన సంతృప్తి ఏర్పడుతుందనే ఉద్దేశంతో పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడుతూ టమాట సాగు చేస్తున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం వరి సాగు చేశానని, గత సంవత్సరం అర ఎకరంలో ఇదే మాదిరిగా మొదటి ప్రయత్నంగా సేంద్రియ ఎరువులను వాడుతూ డ్రిప్ పద్ధతిన టమాట, మిర్చి సాగు చేసినట్లు తెలిపారు. మొదట్లో సేంద్రియ ఎరువులపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల కొంత వరకు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
సేంద్రియ ఎరువు జీవామృతం తయారీ
టమాట సాగులో స్వయంగా తయారుచేసుకున్న జీవామృత సేంద్రియ ఎరువును డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. 10 కేజీల ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల చగన పిండి, 2 కేజీల బెల్లం, అరటి పండుతో పాటు పుట్టమన్ను కలిపి మిశ్రమాన్ని ఓ హౌస్‌లో నిల్వచేసుకుంటే కేవలం 48 గంటల్లోనే ఈ జీవామృత సేంద్రియ ఎరువు తయారవుతుందని తెలిపారు. ఈ ఎరువు వాడకం వల్ల టమాట రుచికరంగా ఉండటం, సరైన సైజు, మంచి రంగుతో పాటు చీడపీడల బాధ తక్కువగా ఉంటుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువు తయారవుతుందని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువును డ్రిప్ ద్వారా మొక్కలకు పారిస్తున్నట్లు తెలిపారు.
సాగు మొదట్లోనే ఖర్చు..
టమాట మొక్కలు ఏపుగా పెరిగేలా టమాట నేలను తాకకుండా ఉండేలా కర్రలు, వైర్ సహాయంగా ఏర్పాటు చేయడం పోల్స్, డ్రిప్ తదితర వాటికి రూ.లక్షా50వేలు అవుతుందని తెలిపారు. ఆ తరువాత కేవలం రూ.25వేల ఖర్చుతోనే టమాట సాగు చేసుకోవచ్చని తెలిపారు. నాటిన 2 నెలల్లోనే టమాట చేతికి వస్తుందని, ప్రస్తుతం ఎకరా పొలంలో 8500 మొక్కలను నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటి రెండు నెలలు కావస్తున్నదని ప్రస్తుతం మొక్కలకు చాలా వరకు పెద్ద సైజులో మంచి రంగుతో కూడుకున్న టమాట కాసిందన్నారు. మార్కెట్లో టమాట ధర బాక్స్‌కు రూ.1200 నుంచి 1500 పలుకుతుందని, బాక్స్‌లో 25 కేజీల టమాట వస్తుందని తెలిపారు. ప్రస్తుత పంటతో దాదాపు రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉన్నట్లు తెలిపారు.