
సెల్లో సిగ్నల్ లేకుంటే మరో విధంగా..
చప్పట్లతో దుంకేలా పరికరం
ఇక స్టార్టర్‌తో పని లేదు
ప్రతిభ చాటిన డిప్లొమా విద్యార్థి కల్యాణ్
ఐడియా బాగుందన్న రైతులు
కల్వకుర్తి/ కల్వకుర్తి రూరల్, డిసెంబర్ 25 : వ్యవసాయ బోరు మోటారును సెల్‌ఫోన్ సాయంతో ఆన్, ఆఫ్ చేసి ఔరా అనిపించాడో పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థి. తన తండ్రి వ్యవసాయ పొలం వద్ద మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. మరో రైతు ఇలాంటి విద్యుదాఘాతానికి గురి కావొద్దనే ఉద్దేశంతో కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కల్యాణ్ ఏదైనా చేయాలనే ఆలోచన అతడి బుర్రకు తట్టింది. స్విచ్ నొక్కకుండా బోరులోంచి నీళ్లు వచ్చేందుకు ప్రయోగాలు చేశాడు. ధ్వని తరంగాలతో బోరు మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసే విధానం కనిపెట్టాడు. ఒకవేళ ఫోన్లో సిగ్నల్స్ లేకుంటే చప్పట్లతో మోటారు స్టార్ట్ అయ్యేందుకు పరికరాన్ని తయారు చేసి స్టార్టర్కు అనుసంధానం చేశాడు. ఇతడి ఐడియా బాగుందని రైతన్నలు ప్రశంసిస్తున్నారు.
‘ఓ విద్యార్థి తండ్రి వ్యవసాయ మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు.. దీంతో కొడుకు హృదయం బాధతో విలవిలలాడింది.. ఆ బాధలో నుంచి చిన్ని ఆలోచన వచ్చింది.. తన తండ్రి ఇంకెప్పుడూ విద్యుత్ ప్రమాదానికి గురి కాకూడదని తలపించాడు.. ఆ చిన్న మేథస్సు అద్భుతం సృష్టించింది.. వ్యవసాయ బావి వద్ద మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసేందుకు సెల్‌ఫోన్ ఉపయోగించాడు.. ఒకవేళ ఫోన్లో చార్జింగ్ లేకుంటే.. స్విచ్ ఆఫ్ అయితే.. సిగ్నల్ లేకుంటే ఎలా అని ఆలోచించాడు.. ధ్వని తరంగాలతో మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసే విధానంపై చిన్న చిన్న ప్రయోగాలు చేసి విజయం సాధించాడు.. చప్పట్లు కొడితే చాలు.. ఆన్, ఆఫ్ అయ్యేలా చిన్న పరికరాన్ని తయారుచేసి బోరు స్టార్టర్కు అనుసంధానం చేశాడు.. విజయవంతమయ్యాడు..’ అతని మేథస్సు గురించి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన కర్నె కల్యాణ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్నాడు. పదో తరగతి వరకు తమ పక్క గ్రామమైన తోటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించాడు. తమకున్న ఐదెకరాల్లో తండ్రి లక్ష్మయ్య వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, గతేడాది లక్ష్మయ్య వ్యవసాయ బోరు వద్ద మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీనిని చూసి కల్యాణ్ కలత చెందాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌తో విద్యుత్ మోటార్ ఆన్, ఆఫ్ అయ్యేలా పరికరాన్ని తయారు చేసి మోటార్ స్టార్టర్కు అనుసంధానం చేశాడు. స్టార్టర్ ముట్టుకోకుండా సెల్‌ఫోన్‌తో ఆపరేట్ చేసేలా తండ్రికి నేర్పించాడు. సెల్ఫోన్లో సిగ్నల్ లేకుంటే.. స్విచ్ ఆఫ్ అయితే.. పాడయితే ఎలా అని ఆలోచించిన కల్యాణ్ ధ్వని తరంగాలతో విద్యుత్ మోటార్ ఆన్, ఆఫ్ అయ్యేలా చిన్న పరికరాన్ని తయారు చేయాలని ప్రయత్నించాడు. కేవలం రూ.1,300 ఖర్చుతో సోలార్ ప్యానల్, సౌండ్ సెన్సార్, సర్వో మీటర్, కేబుల్, బ్యాటరీలతో ధ్వని గ్రహీత పరికరాన్ని తయారుచేశాడు. పరికరాన్ని బోరు స్టార్టర్కు అనుసంధానం చేశాడు. స్టార్టర్ సమీపంలో చప్పట్లు కొడితే చాలు మోటార్ ఆన్ అవుతుంది.. మళ్లీ చప్పట్లు కొడితే ఆఫ్ అవుతుంది.
విద్యార్థి ప్రతిభకు గ్రామస్తుల హర్షం..
చప్పట్లతో మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసేలా పరికరాన్ని తయారు చేసిన కల్యాణ్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన కల్యాణ్ ప్రతిభను మరింత వెలికితీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా, తనకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టమని, ఈ క్రమంలోనే పరికరాన్ని తయారు చేసినట్లు కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ప్రజలకు మరిన్ని ఉపయోగపడే పరికరాలను తయారుచేస్తానని చెప్పాడు.