
శ్రీరామ, జయరామ గ్రూపునకు అవార్డులు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీరామ, జయరామ గ్రూపు చైర్మన్ బెక్కరి రామిరెడ్డి సామాజిక బాధ్యతలో రాష్ట్ర స్థాయి అవార్డును చేజిక్కించుకున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన క్రెడాయ్ టీఎస్ కాన్ క్లేవ్-2021లో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చేతుల మీదుగా రాష్ట్రంలోనే ఉత్తమంగా సామాజిక సేవలు అందించినందుకుగానూ బెస్ట్ సీఎస్ఆర్ యాక్టివిటీ డెవలపర్ క్యాటగిరిలో అవార్డును అందుకున్నారు. దీంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉత్తమ స్థిరాస్తి సంస్థగా శ్రీరామ, జయరామ గ్రూపునకు చెందిన శ్రీరామ ల్యాండ్ మార్క్‌కు అవార్డు దక్కింది. కరోనా సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు, నిరుపేద పింఛన్‌దారులు, మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకున్నది. ఇక మహబూబ్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా తీర్చిదిద్దిన శ్రీరామ ల్యాండ్ మార్క్ సైతం స్థిరాస్తి రంగంలో అత్యుత్తమ సంస్థగా ఎంపికైంది. ఇంటీరియర్ విషయంలో డిజైనర్ అయిన తన కూతురు శిల్పారెడ్డి నైపుణ్యం వల్ల శ్రీరామ ల్యాండ్ మార్క్ ప్రత్యేకంగా నిలిచిందని బెక్కరి రామిరెడ్డి అన్నారు. తమకు రెండు అవార్డులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి బాలకిష్టారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన నుంచి సేవాభావం పెంపొందించుకున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు. వ్యాపార రంగంలో అత్యుత్తమంగా ఉండటంతో పాటు సామాజిక సేవాభావం తనకు రెండు కండ్లతో సమానమన్నారు. భవిష్యత్తులోనూ సామాజిక సేవ కొనసాగుతుందని ఆయనన్నారు.