
మెదక్, జనవరి 25 : గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా మిగిలి ఉన్న లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చిలోగా కస్టమ్డ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) చేసి, ఎఫ్సీఐ గోదాములకు తరలించాలని రైస్ మిల్లర్లను అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వానకాలంలో 4 లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, అందులో కస్టమ్స్ మిల్లింగ్ రైస్ 2 లక్షల 92వేల మెట్రిక్ టన్నులని, కాగా, లక్షా 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చి నాటికి మిల్లింగ్ చేసి డెలివరీ చేయాలని సూచించారు. రైస్ మిల్లుల వారీగా సమీక్షిస్తూ కస్టమ్స్ మిల్లింగ్ వేగివంతం చేయాలని, తగినన్ని గన్నీ బ్యాగులు సమకూర్చడంతో పాటు ధాన్యం భద్రపరిచేందుకు స్థలం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, రైస్ మిల్లుల జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్, వివిధ రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.