
కళలు, కళాకారులను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు
ఆయనతోనే నాకు గుర్తింపు: దర్శనం మొగులయ్య
మహబూబ్‌నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అరుదైన 12మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. వారసత్వంగా వచ్చిన 12మెట్ల కిన్నెరను వాయిస్తూ మొగులయ్య గుర్తింపును పొందారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు సంతలు, జాతర్లలో కిన్నెర వాయిస్తూ ఆయన జీవనం గడిపేవారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు గుర్తింపు లభించింది. మొగులయ్య 12మెట్ల కిన్నెర గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆయనను సముచితంగా సన్మానించారు. 2016లో మొగులయ్య ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారం అందుకున్నారు. దీంతో అప్పటి వరకు వీధుల్లో కిన్నెర వాయించే వ్యక్తిగా ముద్ర పడిన మొగులయ్యకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ‘తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాతే నన్ను గుర్తిస్తున్నారు.. నా పేదరికాన్ని చూసి సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నాకు ప్రత్యేకంగా నెలనెలా కళాకారులకు ఇచ్చే పింఛన్ రూ.10వేలు అందిస్తున్నారు.. ఉగాది పురస్కారం ఇచ్చి తెలంగాణ సర్కారు నన్ను గౌరవించింది.. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోనూ నా గురించి రాయడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న 12మెట్ల కిన్నెర కళ అంతరించిపోకుండా కాపాడుతున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటా’ అని మొగులయ్య ‘నమస్తే’కు తెలిపారు. భీమ్లానాయక్ సినిమా టైటిల్ సాంగ్‌లో మొగులయ్య గొంతు అందరినీ ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్‌ను సినిమాలో పరిచయం చేసే ఆ పాటతో మొగులయ్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ దర్శనం మొగులయ్య పాడిన పాట ఆర్టీసీ ఎండీని ఎంతో ఆకట్టుకుంది. ఆయన పేదరికం గురించి తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆయన టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కూడా కల్పించారు.