రంగురంగుల కాగితాలు, విద్యుద్దీపాలతో ముస్తాబైన చర్చిలు
క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
యాచారం/చేవెళ్ల/ధారూరు/కొడంగల్/షాద్నగర్ టౌన్/వికారాబాద్, డిసెంబర్ 24 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రైస్తవులు ఇండ్లను శుద్ధి చేసుకుని ఇండ్లపై స్టార్ గుర్తులను ఏర్పాటు చేసుకున్నారు. యాచారం మండలంలోని సెయింట్ గ్రిగోరియస్ బాలగ్రామ్లోని చర్చిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. బాలగ్రామ్లోని అనాథ చిన్నారుల మధ్య నిర్వాహకులు వేడుకలను ప్రారంభించారు. క్రిస్మస్ రోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మండలంలోని మేడిపల్లి, మల్కీజ్గూడ, యాచారం, కుర్మిద్ద, గున్గల్, నందివనపర్తి, తులేఖుర్ధు, నజ్దిక్సింగారం, చేవెళ్ల మండలంలోని దామరిగిద్ద, కందవాడ, ఆలూర్, మల్కాపూర్, పామెన, కుమ్మెర, బస్తేపూర్, చేవెళ్ల పట్టణంలోని చర్చి, షాద్నగర్ పట్టణంలోని జియో ఎంబీ చర్చి, న్యూ అఫోస్పూల్ చర్చి, బాప్టిస్టు, ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం, ఎబ్రాన్ చర్చిలు ప్రత్యేకాలంకరణలతో ముస్తాబయ్యాయి. వికారాబాద్ పట్టణంలోని చర్చిలు, ధారూరు మండల కేంద్రంతో పాటు ధారూరు స్టేషన్, మోమిన్కలాన్, మైలారం, ధర్మపూర్ గ్రామాల్లోని చర్చిలు, కొడంగల్ మండలంలోని అంగడిరైచూర్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
క్రిస్మస్ పండుగ ప్రత్యేకత..
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు తెల్లవారుజామునే నూతన వస్ర్తాలు ధరించి, ఏసుక్రీస్తు పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అతిథులకు, బంధువులకు పాయసం తినిపించి, పిండివంటలు చేసుకుంటారు. మతగురువులు చర్చిల్లో ఏసుప్రభువు జీవిత చరిత్రను చదివి వినిపిస్తారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన పాటలు పాడుతూ నాటికలను ప్రదర్శిస్తారు.
పరిగి/షాబాద్, డిసెంబర్ 24 ః క్రిస్మస్ పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా క్రైస్తవులకు మంత్రి సబితారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు మానవాళిని సన్మార్గంలో నడిపిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని మతాలను సమాన ప్రాతిపదికన గౌరవిస్తున్నారని మంత్రి తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా నిర్వహించుకోవాలని మంత్రి కోరారు.