ఇంటి అవసరానికి మాత్రమే వరి పంట..
మిగతావన్నీ ఇతర పంటలే
పాలకూర, మెంతి కూర, కొత్తిమీర సాగు…
అత్యధికంగా సుమారు 80 ఎకరాల్లో పూదీనా సాగు
రాజధానిలోని పలు మార్కెట్లకు తరలింపు
మంచి లాభాలు గడిస్తున్న గ్రామ అన్నదాతలు
యాచారం, డిసెంబర్ 24 :ఆకుకూరల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నది యాచారం మండలంలోని మొండిగౌరెల్లి. గ్రామంలో ఎక్కడ చూసినా పూదీనా, పాలకూర, మెంతికూర, కొత్తిమీర తోటలే దర్శనమిస్తాయి. ప్రధానంగా పూదీనా సాగు చేయడం ఇక్కడి ప్రత్యేకత. 90శాతం రైతులు సుమారుగా 80 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. దీంతో గ్రామ పొలిమేరకు రాగానే పూదీనా వాసన స్వాగతం పలికినట్లుగా ఉంటుంది. స్వంతానికి కొద్దిపాటి వరిపంట వేసుకొని మిగతా పొలంలో ఆకుకూరలను పండిస్తున్నారు. ఇక్కడి పంటలను హైదరాబాద్‌లోని పలు మార్కెట్లకు తరలించి మంచి లాభాలు పొందుతున్నారు.
అది ఓ మారుమూల పల్లె.. ఆ పల్లెలో రైతులంతా అధికంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులంతా ఆకుకూరలు పండిస్తారు. పూదీనా సాగుకు గ్రామం పెట్టింది పేరు. గ్రామ శివారులకు వెళితే సరి అంతా పూదీనా వాసనే. రైతులు పూదీనాను నగరానికి రవాణా చేస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేస్తున్నారు. ఉన్న కొద్ది పాటి భూమిలోనే, కొద్దిపాటి నీటితో పూదీనా, కొత్తిమీర, పాలకూర, మెంతికూర తదితర ఆకు కూరలను పండిస్తున్నారు మండలంలోని మొండిగౌరెల్లి రైతులు. తినడానికి కొద్దిపాటి వరి పంట వేసుకొని మిగతాది వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా పూదీనా సాగులో నిమగ్నమై మంచి లాభాలను పొందుతున్నారు.
పూదీనా సాగుకు పెట్టింది పేరు..
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామం పూదీనా సాగుకు పెట్టింది పేరు. గ్రామంలో 2011జనాభా లెక్కల ప్రకారం 364 కుటుంబాలు ఉండగా 1498 మంది జనాభా ఉన్నది. 90 శాతం రైతులు పూదీనా సాగు చేయడం ఇక్కడి ప్రత్యేకత. వ్యవపాయం చేసే ప్రతి రైతు తన పొలంలో పూదీనా సాగు చేస్తున్నారు. కొన్నేండ్ల నుంచి ఇక్కడి రైతులు పూదీనా సాగు చేస్తున్నారు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో పూదీనా సాగు చేసి మంచి లాభాలను గడిస్తున్నారు. గ్రామంలో సుమారు 50 నుంచి 80 ఎకరాలకు పైగా పూదీనా సాగు చేస్తున్నారు. పూదీనాతో పాటుగా కొత్తిమీరా, పాలకూర, మెంతికూర, తోటకూర తదితర ఆకుకూరలను పండిస్తూ ఇక్కడి రైతులు మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు.
మార్కెట్లో మంచి డిమాండ్
మొండిగౌరెల్లిలో పండించే పూదీనాతో పాటు ఇతర కూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. రైతులు పొలంలో సాగు చేసిన పూదీనాను కోసి కట్టలుగా కడుతారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పూదీనా కట్టల మూటలను క్రూయిజర్లు, ఆటోల్లో తరలిస్తారు. గ్రామం నుంచి ప్రతి రోజు 30 నుంచి 35 మంది రైతులు ఆకుకూరలను తీసుకొని హైదరాబాద్‌కు వెళ్తారు. కట్టలను నగరంలోని మాదన్నపేట మార్కెట్‌కు తరలిస్తారు. అక్కడ వీటికి భలే డిమాండ్ ఉంటుంది. తాజా కూరలు కావడంతో ప్రజలు రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రూ.5కు నాలుగు కట్టలను విక్రయిస్తారు. ఒక్కో రైతు నిత్యం సుమారు 2వేల నుంచి 6వేల కట్టల వరకు విక్రయిస్తారు. డిమాండ్‌ను బట్టి నిత్యం సుమారు రూ.2వేల నుంచి రూ.5వేలకు పైగా సంపాదిస్తారు. కొంతమంది రైతులు నేరుగా ప్రజలకు విక్రయిస్తే మరికొంత మంది రైతులు హోటళ్లకు, ఇతర దుకాణాలకు ప్రతి రోజూ క్రమం తప్పకుండా విక్రయిస్తారు. దీంతో మంచి లాభాలను గడిస్తారు.
రోజూ కూలి దొరుకుతది..
పూదీనా కోసి కట్టలు కట్టేందుకు రోజు కూలి దొరుకుతది. వేరే ఊర్లళ్ల కూలిలేక వలసలు పోతుండ్రు. కానీ మా ఊళ్లో పూదీనా తోటలో పని రోజు దొరుకుతది. పని దేవులాడుకోవాల్సిన పనిలేదు. పూదీనా, కొత్తిమీరా, పాలకూర తోటల్లో పని చేసి నాలుగు డబ్బులు సంపాదించి ఇల్లు గడుపుతాం. ఒక్కొక్కరు రోజుకు వెయ్యి నుంచి రెండు వేల కట్టలు కడుతాం.
వృద్ధులకు ఉపాధి..
ఇతర పనులు చేతగాని వృద్ధులకు పూదీనా కట్టలు కట్టే పనితో ఉపాధి దొరుకుతుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా పూదీనా, కొత్తిమీరా కోసి కట్టలు కడుతాం. దానికి ఫలితంగా తగిన కూలి దొరుకుతుంది. కష్టంతో కూడుకున్న పని చేయలేం కాబట్టి కూర్చొని పూదీనా కట్టలు కట్టె పని చేస్తాం. పూదీనా సాగుతో ఎక్కువ మందికి కూలీ దొరుకుతుంది.