హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌లో ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే
పత్రీజీతో కలిసి కింగ్ చాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్
కడ్తాల్, డిసెంబర్ 24: మనస్సును నియంత్రించుకుంటే అంతా మంచే జరుగుతుందని, ధ్యానాన్ని మించిన సంపదలేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో జరుగుతున్న మహిళా ధ్యాన మహాసభలు-3 ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ధ్యాన మహాసభల్లో ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఆయనకి నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ధ్యాన గురువు సుభాశ్ పత్రీజీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేశ్వర మహా పిరమిడ్‌ను ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి గవర్నర్ సందర్శించారు. పిరమిడ్‌లోని కింగ్ ఛాంబర్లో సుభాశ్ పత్రీజీతో కలిసి గవర్నర్ కాసేపు ధ్యానం చేశారు. అనంతరం ధ్యాన మహా సభల్లో గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడారు. భారతదేశంలో మహిళా శక్తి చాలా గొప్పదని, మహిళలు ఉన్న స్థలంలో శుభం, క్షేమం, శాంతి కలిగి ఉంటాయని తెలిపారు. సమాజ సేవ చేయడమే గొప్ప పదవి అని పేర్కొన్నారు. సేవ చేయడానికి గొప్ప హృదయం అవసరమని, మనం చేసే మంచి పనులే సమాజంలో గుర్తింపునిస్తాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం వస్తే, భారతదేశం విశ్వ గురువు అవుతుందన్నారు. నిత్యం ధ్యానంతో మానసిక ప్రశాంతాత లభిస్తుందని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఉన్న సమయంలో ధ్యాన సాధన నేర్చుకున్నానని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. పిరమిడ్ మహా సభల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో మహేశ్వర మహా పిరమిడ్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ ఎలాంటి ఫీజు లేకుండా ఎంతో మందికి ధ్యానం అందజేస్తున్న పత్రీజీ గొప్పవారని, నిత్య ధ్యాన సాధనతో ఆనందమయ జీవితం పొందవచ్చని తెలిపారు. మహేశ్వర మహా పిరమిడ్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పిరమిడ్‌ను కడ్తాల్ మండలంలో నిర్మించిన ట్రస్టు సభ్యులను ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ధ్యాన మహాసభల్లో పాల్గొంటున్న ధ్యానులకు వసతులు కల్పిస్తున్న ట్రస్టు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. పత్రీజీ మాట్లాడుతూ ధ్యానం సర్వరోగా నివారణి అని, సామూహిక ధ్యానంతో అద్భుత శక్తి వస్తుందన్నారు. అనంతరం గవర్నర్‌కు సుభాశ్పత్రీజీ జ్ఞాపికను అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, ప్రముఖ కంటి వైద్యుడు సాయిబాబాగౌడ్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మన్యానాయక్, మహేశ్, శంకర్‌నాయక్, సాయిలాల్, భగీరథ్, ట్రస్టు సభ్యులు స్వర్ణమాల, సాంబశివరావు, బాలకృష్ణ, శివప్రసాద్, హనుమంతరాజు, లక్ష్మీ, జయశ్రీ, సౌమ్యకృష్ణ, శ్రీరాంగోపాల్, రాంబాబు, ప్రేమయ్య, దామోదర్‌రెడ్డి, రవిశాస్త్రి, మాధవి, సాగర్ పాల్గొన్నారు.