వికారాబాద్, డిసెంబర్ 24: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిం చేందుకే ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధి లోని సిద్దులూర్ గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో సిబ్బంది సమయపాలన పాటించాలని, అందుకు బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ లీకేజీలు లేకుండా గ్రామానికి సరిపడా నీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. డీఈవోతో మాట్లాడి తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్లు వాడకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, సర్పంచ్ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీటీసీ గౌస్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గఫార్, ఆయా శాఖల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు
మర్పల్లి, డిసెంబర్ 24 ః ప్రభుత్వం పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నదని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త శ్రీనివాస్ రెడ్డి కొన్నిరోజుల క్రితం ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న బిల్లులతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ లక్షా 50 వేల మంజూరు అయ్యాయి. శుక్రవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కును అందజేశారు.కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాణి గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు