షాబాద్, డిసెంబర్ 24 : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ సెంట్రల్ టీం సభ్యుడు శ్యామ్‌బాబు అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చిన్నసోలీపేట్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి మరుగుదొడ్ల వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం, నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. రోడ్లపై మురుగునీరు పారకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. తడి, పోడి చెత్త వేరుచేసి డంపింగ్‌యార్డుకు తరలించాలని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డిజిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ బోరాంచ రమ్యకృష్ణ, ఎంపీటీసీ మామిడి లత, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఏపీవో వీరాసింగ్ ఉన్నారు.
ఆలూరును సందర్శించిన అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 24 : స్వచ్ఛత సర్వేక్షణ్‌లో భాగంగా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ, పరిసరాలు, ప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని ప్రధాన వీధులను పరిశీలించారు. గ్రామాన్ని స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీవో హరీశ్‌కుమార్, ఎంపీవో విఠలేశ్వర్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, సర్పంచ్ కవ్వగూడెం విజయలక్ష్మీనర్సింహులు, ఉప సర్పంచ్ కసిరె వెంకటేశ్ యాదవ్, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
కొత్తూరు మండలంలో..
కొత్తూరురూరల్, డిసెంబర్ 24 : కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ, పెంజర్ల గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కమిటీ రెండు బృందాల సభ్యులు పర్యటించారు. మండలంలోని పెంజర్ల, ఇన్ముల్‌నర్వ గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కమిటీ సభ్యులు శ్రావణ్ బృందం, అశోక్‌రెడ్డి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా పెంజర్ల, ఇన్ముల్‌నర్వ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ మామిడి వసుంధర, అజయ్‌నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొని సర్వే ఉద్దేశంపై గ్రామపంచాయతీ సభ్యులకు వివరించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలోని వీధులగుండా పర్యటించి గ్రామపంచాయతీ పరిపాలన, పారిశుధ్య నిర్వహణపై గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. హరితహారం, తడి, పొడి చెత్తసేకరణ, ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీవో సురేశ్‌బాబు, ఇన్చార్జి ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో నర్సింహ, ఎంపీటీసీలు అంజమ్మ, శోభ, పంచాయతీ కార్యదర్శులు వంశీకృష్ణ, అలివేలు, మాజీ మార్కెట్‌కమిటీ డైరెక్టర్ భీమయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు.
ఎలిమినేడులో పారిశుధ్య పనులు భేష్
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 24 : ఎలిమినేడులో పారిశుధ్య పనులు బాగున్నాయని కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అధికారులు సాయిబాబా, శివప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 రాష్ట్ర, జిల్లాస్థాయిల ర్యాంకింగ్‌లకు గ్రామీణ పారిశుధ్య సర్వేలో భాగంగా తాగునీరు, పారిశుధ్యం పనులపై కేంద్ర బృందం గ్రామాల్లో పరిమాణాత్మక, గుణాత్మకమైన అంశాలను పరిశీలన జరిపి ర్యాంకింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ బృందం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, చెత్తసేకరణ, మురుగునీటి నిర్వహణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త నిర్వహణ, పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్యాలయం, ఆలయాలు, ప్రార్థనా స్థలాల వంటి సామూహిక ప్రదేశాల్లో పారిశుధ్య వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు సాయిబాబా, శివప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీఎల్పీవో సంధ్యారాణి, సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఎస్బీఎం రోజా, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేశ్‌బాబు, మంచాల ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో సురేశ్‌రెడ్డి, వార్డు సభ్యులు బుట్టి మహేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.