
ఏ కూరగాయ చూసినా కేజీ రూ.40పైనే
అల్లాడుతున్న సామాన్యులు
జిల్లాలో అంతంత మాత్రంగానే సాగు
దిగుమతులపైనే ఆధారం
ప్రభావం చూపిన వర్షాలు
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/చేర్యాలటౌన్/న్యాల్కల్, నవంబర్ 23: నెల రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏది కొందామన్నా కిలోకు రూ.40 పైనే పలుకుతున్నాయి. కేజీ టమాట రూ.80 నుంచి రూ.110 వరకు ఉంది. ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరల పెరుగుదలకు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి ఒక కారణమైతే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా రైతులు కూరగాయల పండించకపోవడం మరో కారణం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రో, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడంతో ట్రాన్స్పోర్టు భారం పెరిగిందంటూ వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.
కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజులుగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదలకు సంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి దిగుమతి ఒక కారణమైతే, జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా రైతు లు కూరగాయల పండించకపోవడం మరోకారణం. కేం ద్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్, పెట్రో ధరలు పెంచడం తో కూరగాయల వ్యాపారులు ట్రాన్స్పోర్టు భారం పెరిగిందంటూ ధరలు పెంచుతున్నారు. దీనికితోడు వ్యాపారులు హైదరాబాద్ నుంచి తెచ్చిన కూరగాయలను రిటైల్ వ్యాపారులకు ధరలు పెంచి అమ్ముతున్నారు.
కిలోకు రూ.40 పైనే..
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూరగాయలను కిలోకు రూ.40 పైనే అమ్ముతున్నారు. రైతు బజారు, కూరగాయల మార్కెట్లలో సైతం ధరల్లో తేడా ఎక్కువగా కనిపించడం లేదు. సంగారెడ్డి జిల్లాలో టమాట కేజీ రూ.80 నుంచి రూ.110 వరకు ఉంది. బీరకాయ, కాకర, చిక్కుడు, చిన్నచిక్కుడు, బీన్స్ తదితర కూరగాయలు కేజీ రూ.60 నుంచి రూ.100 మధ్య అమ్ముతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వం కాయ కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. క్యాలిఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం కేజీకి రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. ఉల్లిగడ్డ పాతది కేజీ రూ.40 నుంచి రూ.50 అమ్ముతుండగా, కొత్తడి రూ.30 పలుకుతోంది. కోడిగుడ్డ సైతం రూ.5.50 నుంచి రూ.6 వరకు అమ్ముతున్నారు.
కూరగాయల సాగు అంతంతే..
జిల్లాలో కూరగాయల సాగు అంతంతే ఉంది. రైతాంగం వాణిజ్య పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని గుమ్మడిదల, జిన్నారం, కంది, కొండాపూర్, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో ఎక్కువగా రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి సీజన్లో 6 నుంచి 10వేల ఎకరాల్లో రైతులు కూరగాయలను సాగు చేస్తారు. జిల్లాలో ఎక్కువగా రైతులు టమాట, వంకాయ, ఆలుగడ్డ, ఆకుకూరలు సాగవుతాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన అధిక వర్షాలకు జిల్లాలోని ప్రధాన పంటలైన పత్తి, వరితో పాటు కూరగాయల పంటలు, జిల్లాలో సుమారు 3వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
కొనాలంటే భయమేస్తున్నది
మార్కెట్లో కూరగాయలు కొనాలంటే భయమేస్తున్నది. ధరలు విపరీతంగా పెరిగాయి. టమాట కిలో ధర రూ.80 నుంచి రూ. 100కు అమ్ముతున్నారు. రూ. 500 తీసుకుని మార్కెట్కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. కూరగాయల ధరలు పెరగడంతో మాలాంటి సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.