ఇన్ని పథకాలిస్తుండు అండగా ఉండాలే
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి
చిట్యాల ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో 84 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
సివిల్ దవాఖాన సందర్శన
వైద్యులు, వైద్యసిబ్బంది పనితీరుపై అసంతృప్తి
చిట్యాల, అక్టోబర్ 23 : పేద వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ను యాది మరువొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ ఫలాలను అందజేస్తున్న ఆయనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. మండలకేంద్రం శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం 84 మంది లబ్ధిదారులకు రూ.84,09,744 విలువగల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. భూపాలపల్లి నియోజక వర్గం పక్కనే ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఆ నియోజక వర్గంలోని బంధువులు, మిత్రులకు చెపాలని ఎమ్మెల్యే కోరారు.
సివిల్ దవాఖాన ఆకస్మిక తనిఖీ
మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని ప్రతి గదిని సందర్శించి పరిశుధ్యాన్ని పరిశీలించారు. వైద్య పరీక్షల ల్యాబ్‌ను సందర్శించి రోజుకు ఎంత మందికి ఏఏ టెస్టులు చేస్తున్నారని లాబ్టెక్నీషన్ సింధును అడిగితెలుసుకున్నారు. అనంతరం ఓపీ విభాగంలోని వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. తప్పుల తడకగా రికార్డు ఉండటంతో అసంతృప్తి వ్యకం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధులు నిర్లక్ష్యంగా నిర్వర్తించడంపై మండిపడ్డారు. అనంతరం జనరల్ వార్డులోని రోగులను పరామర్శించి ప్రభుత్వం నుంచి లభిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రానున్న మూడు రోజుల్లో దవాఖాన సూపరింటెండెంట్ తిరుపతి ఆధ్వర్యంలో వైద్యాభివృద్ధి సేవలపై సమావేశం ఏర్పాటుచేసి దవాఖానలో భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకుంటమని హామీ ఇచ్చారు. ఎమెల్యే వెంట ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, డిప్యూటీ తహసీల్దార్ వేణు, ఆర్ఐ నరేందర్, స్థానిక సర్పంచ్ పూర్ణ చందర్రావు, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కామిడీ రత్నాకర్‌రెడ్డి, జంబుల తిరుపతి, స్థానిక ఎంపీటీసీ కట్కూర్ పద్మానరేందర్, కోఆప్షన్ మెంబర్ ఎండీ రాజమహ్మద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.