
మంచిర్యాలటౌన్/సీసీసీ నస్పూర్/శ్రీరాంపూర్, అక్టోబర్ 23 : మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. మధ్యాహ్నం 2.03 గంటలకు 2 నుంచి 5 సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్లోని ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందోనని ఆలోచించే లోపే కదలిక నిలిచిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం కూడా ఇదే విధంగా జరుగగా, స్థానికులు గుర్తుచేసుకొని చర్చించుకుంటున్నారు.
మంచిర్యాలలోభూ ప్రకంపనలు
మంచిర్యాల జిల్లాలో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. జిల్లా కేంద్రంలోని సున్నంబట్టివాడ, తోళ్లవాగు ఏరియా, శ్రీశ్రీనగర్, మజీద్‌వాడ, గోసేవా మండలిరోడ్, కాలేజీరోడ్, ఎన్టీఆర్నగర్, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ, శ్రీరాంపూర్, నస్పూర్‌కాలనీ, గోదావరికాలనీ(షిర్కె), నాగార్జునకాలనీ, సీతారాంపల్లి, శ్రీరాంపూర్, సింగాపూర్, తాళ్లపల్లి, క్రిష్ణాకాలనీ, విలేజ్ శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.03 గంటలకు 2 నుంచి 5 సెకన్ల పాటు కంపించింది.
భయాందోళనలో ప్రజలు
ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్లలోని గిన్నెలు కిందపడడం, కుర్చీలు పక్కకు జరగడం, భూమి కదిలినట్లు కావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు సైతం భూ ప్రకంపనలను గుర్తించి ఆందోళన చెందారు. అసలు ఏమవుతుందోనని ఆలోచించేలోపే భూ ప్రకంపన నిలిచిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సున్నంబట్టి వాడలోని పలువురు ఇండ్లల్లో కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. పై పెచ్చులు ఊడి పడ్డాయి.భూమి కంపించిన విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, మినాజ్ వార్డుల్లో పర్యటించారు. ఇండ్లలోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. సింగాపూర్‌లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు కింద పడ్డాయి. ఓసీపీ బ్లాస్టింగ్ల వల్లే ఇలా జరుగుతుందని సింగరేణి ప్రాంతాల ప్రజలు భావించారు. భూకంపంతో భూగర్భ గనుల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెక్టార్ స్కేల్ 4 క్రిస్మోస్కేల్మీటర్లు కంపించింది. 6 నుంచి 8 మధ్య రెక్టార్ క్రిస్మోస్కేల్ మీటర్ల భూకంపం ఏర్పడితే మాత్రం భూమి పగుళ్లు తేలి పెద్ద ఎత్తున ప్రమాదాలు, ప్రాణనష్టం జరిగేదని, ఇది స్వల్ప భూ ప్రకంపలేనని అధికారులు అంచనాకు వస్తున్నారు.
ఐదేళ్ల క్రితం..
జిల్లాలో శనివారం భూ ప్రకంపనలు రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదేళ్ల క్రితం కూడా నస్పూర్ కేంద్రంగా ఇదే విధంగా భూ కంపం వచ్చిన విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలోని నస్పూర్, జైపూర్ మండలాలతో పాటు మంచిర్యాలలోని కొన్ని ప్రాంతాల్లో 2016 నవంబర్ 17న రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. నస్పూర్ కేంద్రంగా ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడు నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. నస్పూర్, సీతారాంపల్లి, తీగల్‌పహాడ్, సింగాపూర్, తాళ్లపల్లి, జైపూర్ మండలంలోని ఇందారం, రామారావు పేట గ్రామాలు, మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్, సున్నంబట్టి వాడ, రాంనగర్, జన్మభూమి నగర్ భూమి కంపించింది. ఆ ప్రభావానికి కుర్చీలు, మంచాలు, ఇండ్లలోని వస్తువులు ఒక్కసారిగా పడిపోయాయని పలువురు గుర్తు చేసుకున్నారు.