ఉపాధి కూలీల కుటుంబాలకు కొలువుల చేయూత
వందరోజుల పని పూర్తి చేసుకున్న కూలీల పిల్లలకు ఉచిత శిక్షణ
ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్న అధికారులు
శిక్షణా కాలంలోనూ ఆర్థిక చేయూత..
వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 446 మందికి శిక్షణ.. 335 మందికి జీవనోపాధి
పరిగి, డిసెంబర్ 22 : ఉపాధిహామీ పనులే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వంద రోజుల ఉపాధి పని పూర్తి చేసుకున్నవారి పిల్లలకు ‘ఉన్నతి’ పేరిట వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ అందించి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కూలీల పిల్లలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఎన్ఏసీ, ఈడబ్ల్యూఆర్‌సీ, డీఆర్డీఏ, ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా పలు అంశాల్లో 90 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా శిక్షణ సమయంలో రోజువారీ కూలి డబ్బులు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 15 బ్యాచుల్లో 446 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు 335 మందికి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. అధికారుల చొరవపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధిహామీలో పనిచేసిన కూలీల ఉన్నతికి అనేక సాంకేతిక రంగాల్లో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది. 2018-19లో వంద రోజులు ఉపాధి హామీ పనులు పూర్తి చేసిన కూలీల కుటుంబ సభ్యులకు ఈ అవకాశం కల్పించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎంప్లాయిమెంట్ జనరేషన్, మార్కెటింగ్ మిషన్ కింద ఉన్నతి పథకం అమలు చేస్తారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీల కుటుంబంలోని నిరుద్యోగ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 2018-19లో వంద రోజులు ఉపాధి హామీ పనులు పూర్తి చేసినవారు 13వేలకు పైగా ఉన్నారు. వారి కుటుంబాల్లోని 18-45 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగులకు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడం ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు కృషి చేయడంలో భాగంగా ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకం అమలు చేస్తున్నది.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా డ్రై వాల్, ఫాల్స్ సీలింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కన్స్ట్రక్షన్స్ సూపర్వైజర్స్, పెయింటింగ్ అండ్ డిస్క్రిన్షన్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, స్టోర్ కీపర్స్, వెల్డింగ్, ల్యాండ్ సర్వేయర్, జూనియర్ మెకానిక్ హైడ్రాలిక్, ట్రాన్స్బ్ అండ్ సెల్ఫ్ లోడింగ్ మిక్సర్ ఆపరేటర్ శిక్షణను 90 రోజులపాటు ఇస్తారు.ఈడబ్ల్యూఆర్‌సీ, డీఆర్డీఏ వికారాబాద్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్స్, లైవ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిటైల్, మార్కెటింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ 18 నుంచి 26 సంవత్సరాల లోపు బాలికలకు 90 రోజులపాటు ఇస్తారు.
ఆర్ఎస్ఈటీఐ, చిలుకూరులో అగర్బత్తీలు, పేపర్ కవర్స్, క్యాండిల్స్, పాపడ్, పికిల్, మసాలా పౌడర్, కస్టమ్స్ జ్యువెలరీ, జూట్ బ్యాగ్, వెదురు బుట్టల సామగ్రి తయారీ, టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్స్, ఫొటోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, టూ వీలర్ రిపేరింగ్, టీవీ టెక్నీషియన్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ సర్వీసెస్, యూపీఎస్ బ్యాటరీ రిపేర్, మోటర్ వైండింగ్, హౌజ్ వైరింగ్, డెయిరీ ఫామింగ్, వర్మికంపోస్ట్, పుట్టగొడుగుల పెంపకం, గొర్రెలు, మేకల, కోళ్ల సంరక్షణపై శిక్షణ, కూరగాయల పెంపకంపై 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు, 8వ తరగతి చదువుకున్నవారికి 10 రోజులపాటు శిక్షణ ఇస్తారు.
కేవీకే ఆధ్వర్యంలో నర్సరీ వర్కర్స్, ఫ్రెష్ వాటర్ అక్వా కల్చర్, వర్మి కంపోస్టు తయారీపై 21 నుంచి 45 సంవత్సరాల వారికి 15 రోజుల శిక్షణ ఇస్తారు.
446 మందికి శిక్షణ.. 335 మందికి ఉపాధి
వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేట్‌లో గల ఈడబ్ల్యుఆర్సీ, డీఆర్డీఏ ద్వారా ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో 446 మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 335 మందికి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి. మొదట నాలుగు బ్యాచ్‌లుగా 123 మంది బాలురకు శిక్షణ ఇవ్వగా ఇప్పటివరకు 91 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. 11 బ్యాచ్‌లలో 323 మంది బాలికలకు శిక్షణ పూర్తవగా 244 మందికి ఆయా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి. ప్రస్తుతం వారంతా తమకు ఉద్యోగం కల్పించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి రత్నదీప్, పాంటలూన్స్, వెస్ట్ సైడ్, రిలయన్స్ ట్రెండ్స్, బిగ్ బజార్, సెంట్రో, స్రింగార్ జ్యువెలర్స్, కేఎఫ్‌సీ, బర్గర్స్ కింగ్, సంప్రడే స్వీట్స్, పిజ్జా హట్లలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఎన్ఏసీ, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్ఎస్ఈటీఐల ద్వారా శిక్షణ పొందేందుకు గ్రామాలవారీగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ కోసం హైదరాబాద్‌లోని ఎన్ఏసీ, రాజేంద్రనగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం, చిలుకూరులోని ఆర్ఎస్ఈటీఐలకు పంపిస్తారు.
నాలుగు సంస్థల్లో ఉచిత శిక్షణ
వంద రోజులు ఉపాధి హామీ పనులు పూర్తి చేసిన కుటుంబాలలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాలుగు సంస్థల ద్వారా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(ఎన్ఏసీ), ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్స్(ఈడబ్ల్యుఆర్సీ, డీఆర్డీఏ), స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం(ఆర్ఎస్ఈటీఐ), వ్యవసాయ పరిజ్ఞాన పెంపు శిక్షణ(కేవీకే)ల ద్వారా నిరుద్యోగులైన యువతకు ఈ శిక్షణా తరగతులు 90 రోజులపాటు ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణా కాలంలో వారికి రోజుకు రూ.237 అందజేస్తారు.
శిక్షణతోపాటు ఉపాధి : వై.మల్లయ్య, ఇన్స్ట్రక్టర్
‘ఉన్నతి’ కార్యక్రమం కింద ఉపాధి హామీ కూలీ పనులు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలలోని యువతకు ఉచితంగా 90 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో 446 మందికి శిక్షణ పూర్తయింది. శిక్షణా కాలంలో వారికి రోజుకు రూ.237 ఇస్తారు. శిక్షణ సందర్భంగా యువతకు అనేక అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంపాటు నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తాం.