రైతన్నకు మరింత ప్రోత్సాహకరంగా సర్కారు నిర్ణయం
పాలీహౌస్‌తో పోల్చితే తక్కువ ధరకే అందజేత
సన్న, చిన్నకారు రైతులకు లాభం
ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, పూలు సాగు చేయొచ్చు
4000 చ.మీ నెట్‌హౌస్‌కు సుమారు రూ.28లక్షలు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం సబ్సిడీ
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 22 : ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల కోసం ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. పాలీహౌస్‌ల మాదిరిగా నెట్ హౌస్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. పాలీహౌస్ పథకం ధనిక రైతులకే కాకుండా పేద, మధ్య తరగతి రైతులకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సబ్సిడీ కొంత మందికే చెందుతుందన్న ఆరోణలకు స్వస్తి పలుకనున్నది. ఈ పథకం నుంచి సన్న, చిన్నకారు రైతులకూ లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఎక్కువ సంఖ్యలో రైతులకు అతి తక్కువ ఖర్చులతో ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నెట్ హౌస్ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నది. నెట్‌హౌస్‌ల కింద ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా నెట్‌హౌస్‌ల ఏర్పాటు చేసుకునే రైతులకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వనుండడంతో జిల్లాలోని అధికమంది రైతులు ముందుకొస్తున్నారు.
ఎకరం విస్తీర్ణంలో పాలీహౌస్ను ఏర్పాటు చేసుకుంటే రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న నెట్‌హౌస్‌ను 4000 చదరపు మీటర్లతో ఏర్పాటు చేసుకుంటే రూ.28లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో రైతు 50 శాతం వాటా ఉంటే, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నది. ప్రతి 4000ల చదరపు మీటర్లకు రూ.28లక్షలు ఖర్చు అవుతుండగా, ఇందులో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుండగా, ప్రభుత్వం వాటా రూ.14లక్షలు, రైతువాటా రూ.14 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పాలీహౌస్‌కు చదరపు మీటరుకు రూ.1000 వరకు ఖర్చవుతుండగా, అదే నెట్‌హౌస్ నిర్మాణానికి చదరపు మీటరుకు రూ.710 ఖర్చు అవుతున్నది. పాలీహౌస్ కింద పరిమిత సంఖ్యలో రైతులకు మాత్రమే అవకాశం ఉండనుండగా, నెట్‌హౌస్ పథకంలో రెండింతలు ఎక్కువగా అవకాశం దొరుకుతున్నది. దీనిపై ఉద్యానవన శాఖ నుంచి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు అన్ని వర్గాలవారికి సబ్సిడీ అందిస్తున్నది.
ప్రయోజనాలు..
నెట్‌హౌస్ ఒక నీడనిచ్చే పందిరి వంటిది. ఇది నాలుగువైపులా ఆగ్రో నెట్లతో చేసిన వలల వంటి వాటితో కప్పి ఉంటుంది. అవసరం మేరకు గాలి, సూర్యరశ్మి, తేమ ప్రవేశించేలా నిర్మాణం ఉంటుంది. ఇవి మొక్కల ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇందులో పందిరి తోటల సాగుతో పాటు ఉద్యానవన పంటలకు సంబంధించిన నారు పెంచుకోవచ్చు. పూల మొక్కలు, గుబురు ఆకులు గల మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలకు సంబంధించిన నారునూ పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. అంటు మొక్కను చీడపీడల నుంచి రక్షిస్తుంది. వర్మీ కంపోస్టు, వర్మీనాస్లాంటిది తయారు చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి.
దరఖాస్తులు చేసుకోవాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెట్‌హౌస్‌ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నది. దీని ద్వారా మరింత ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులతో పాటు అన్ని వర్గాలకు యాభై శాతం సబ్సిడీపై నెట్హౌస్లను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. నెట్‌హౌస్‌లు వేసుకోవడం వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. వీటినీడన పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.