సంబురాలు చేసుకున్న ఉమ్మడి జిల్లా లబ్ధిదారులు
రంగారెడ్డి జిల్లాలో 250,వికారాబాద్ జిల్లాలో 951 మంది హోంగార్డులు
పరిగి/షాబాద్, డిసెంబర్ 22 : హోంగార్డుల వేతనాలను ప్రభుత్వం 30శాతం పెంచడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పెంచిన జీతం ఈ ఏడాది జూలై నుంచి వర్తింపజేయనుండగా హోంగార్డులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లా పరిధిలో 951 మంది, రంగారెడ్డి జిల్లాలో 250 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారికి వేతనాలు పెంచిన సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల గౌరవ వేతనం సైతం 30శాతం పెంచింది. ఇందుకు సంబంధించిన పెరిగిన వేతనాలను ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపజేయనున్నారు. హోంగార్డుల గౌరవ వేతనాల పెంపుతో చిరుద్యోగులకు మేలు చేసిన సర్కారుగా నిలిచింది. హోంగార్డుల గౌరవ వేతనం 30శాతం పెంచుతూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూన్ నాటి గౌరవ వేతనంపై 30శాతం పెంపుదల ఉండనున్నది. ఈ పెంపుదల వల్ల వికారాబాద్ జిల్లా పరిధిలో 951, రంగారెడ్డి జిల్లాలో 250 మంది హోంగార్డులకు గౌరవ వేతనాలు పెరుగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోనే వేతనాల పెంపు
గత పాలకుల హయాంలో హోంగార్డుల వేతనాలు పెంచడం పక్కన పెట్టి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఒక్కోసారి ఆరు నెలలైనా వేతనాలు అందేవి కావు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డులకు ఒక్కసారిగా వేతనాలు పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలు, ఇతర అవసరాలకు తగ్గట్లుగా ఈ గౌరవ వేతనాలు పెంచడం ద్వారా హోంగార్డుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే హోంగార్డుల వేతనాలు పెద్దఎత్తున పెరిగాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.12వేలు ఉన్న గౌరవ వేతనాన్ని 2018లో సీఎం కేసీఆర్ హోంగార్డుల గౌరవ వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. ఈ మేరకు అప్పటి వేతనంపై 30శాతం మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా హోంగార్డుల కుటుంబాల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది.