గురుకుల విద్యా సంస్థల రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శారద
మొయినాబాద్, డిసెంబర్ 22 : గణితంలో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గురుకుల విద్యా సంస్థల రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శారద అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామ సమీపంలో ఉన్న చేవెళ్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్వచ్ఛ పాఠశాలలో గణిత పితామహుడు శ్రీనివాసరామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గణిత పజిల్స్, సమితులు, సాంఖ్యా శాస్త్రం, అంకగణిత మధ్యగత, బహుళకం, గణిత సమస్యలు, మ్యాజిక్ స్కైర్స్, సంఖ్యలు, పూర్ణాంకాలు, రేఖాగణితం మొదలైన గణిత ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించారు. డాక్టర్ శారద విద్యార్థులు చేసిన ప్రదర్శనలు తిలకించి వారిని అభినందించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలపై ఆమె సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీనివాసరామానుజాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. గణితంలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కష్టపడి చదివే విద్యార్థులు గణితంలో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. చదువుకోవడంతోపాటు మంచి గుర్తింపు తెచ్చుకునేలా వినూత్న రీతిలో ప్రయోగాలు చేయాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హలీం ఉన్నీసా, చేవెళ్ల పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డాక్టర్ క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.