పంచాయతీ చిన్నది.. అభివృద్ధి పెద్దది..
నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్త సేకరణ
పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు ఏర్పాటు
అందుబాటులోకి వైకుంఠధామం
గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు
పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా మారిన పల్లె
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 22 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల దశదిశ మారుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధిలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న హస్తేపూర్ గ్రామం ప్రగతి పథంలో పయనిస్తున్నది. గ్రామంలో 547 జనాభా ఉండగా 372 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో అంతారం గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న హస్తేపూర్ నూతన పంచాయతీగా ఏర్పడింది. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తై అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వీధిలో సీ రోడ్లను నిర్మించారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విరివిగా మొక్కలను నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. గ్రామ రోడ్డుకు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని తోరణాల్లా ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ నర్సరీలో హరితహారానికి సిద్ధంగా మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు పూల మొక్కలను నాటడంతో చూపరులను కనువిందు చేస్తున్నాయి. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాను వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ప్రతి వీధిని శుభ్రం చేయడంతో పాటు కలుపుమొక్కలను తొలగిస్తుండడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. త్వరితగతిన పల్లె అభివృద్ధి చెందడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ప్రణాళికలతోనే అభివృద్ధి..
గ్రామ అభివృద్ధిలో ముందస్తు ప్రణాళికలు రచించి ముందుకు సాగడంతోనే అభివృద్ధి సాధ్యమైంది. గతంలోని సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మున్ముందు ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
గత సమస్యలు పరిష్కారం..
పల్లె ప్రగతి పనులతో గతంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించబడ్డాయి. హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం.